బాబు కేబినెట్‌ లో మిడ్‌ నైట్ మినిస్ట‌ర్ ఎవ‌రు..!

Update: 2016-03-15 05:20 GMT
బాబు కేబినెట్‌ లో ఫ‌స్ట్ టైం మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన ఆయనగారికి "మిడ్‌ నైట్ మినిస్టర్'' అనే పేరు ట్యాగ్‌ లైన్‌ గా మారింది. మిడ్‌ నైట్ మినిస్ట‌ర్ అన‌గానే దానికేదో ర‌క‌ర‌కాలు అర్థాలు ఊహించుకోకండి. ఆ మంత్రి గారు అర్థ‌రాత్రి ప‌ర్య‌ట‌న‌లు కూడా చేసేస్తూ అధికారగ‌ణానికి కంటిమీద కునుకులేకుండా చేసేస్తున్నార‌ట‌. మునిసిప‌ల్ శాఖా మంత్రి నారాయ‌ణ మినిస్టర్ అయిన కొత్తల్లో రివ్వుమని నగరంలో వాలిపోయేవారు. అర్థరాత్రి పన్నెండు, ఒంటిగంట వరకూ అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. తెల్లవారుజామున అయిదు గంటలకే ప్రెస్‌ మీట్‌ లు పెట్టేవారు. మంత్రి అయిన ఉత్సాహంలో అలా చేస్తున్నారు అని చాలా మంది అనుకున్నారు.

 అయితే ఆయ‌న ప‌ద‌వి లోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాలు అవుతున్నా ఆయ‌న ఇప్ప‌ట‌కీ అలాగే అర్ధ‌రాత్రి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. నెలలో మూడు దఫాలు ఆయన జిల్లాలో పర్యటిస్తే అందులో రెండు అర్ధ‌రాత్రి ప‌ర్య‌ట‌న‌లే ఉంటున్నాయ‌ట‌. నారాయ‌ణ ఇటీవ‌లే రాత్రి పదకొండు గంటలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి రోగుల్ని పరామర్శించారు. అస‌లే రోగంతో ఉన్న త‌మ‌కు ఈ అర్ధ‌రాత్రి ప‌రామ‌ర్శ‌లు ఏంట్రా బాబు అని అక్క‌డి వారు త‌ల‌లు ప‌ట్టుకున్నార‌ట‌.

 అయితే ఇటీవ‌లే నెల్లూరు జిల్లాకే చెందిన గూడూరు వైకాపా ఎమ్మ‌ల్యే నారాయ‌ణ‌ను ఉద్దేశించి మిడ్‌ నైట్ మినిస్ట‌ర్ అన్న ప‌దం వాడ‌డంతో నారాయ‌ణ‌కు చిర్రెత్తుకొచ్చేసింద‌ట‌. నేను ఎప్పుడు వ‌స్తే మీకెందుకు నా జిల్లా అభివృద్ధి చేసుకుంటున్నానా లేదా అని ఆగ్ర‌హంతో ఊగిపోయార‌ట‌. గ‌తంలో జిల్లాలో మంత్రులుగా ప‌నిచేసిన వారు జిల్లాకు వ‌స్తే రెండు మూడు రోజుల పాటు జిల్లాలో మ‌కాం వేసి ఆ మూడు రోజులు అంద‌రికి అందుబాటులో ఉండి ప‌లువురికి అవ‌స‌ర‌మైన పనులు చేసిపెట్టేవార‌ట‌. అయితే నారాయ‌ణ మాత్రం ఎప్పుడు వ‌స్తారో ఎప్పుడు వెళ‌తారో కూడా ఆయ‌న స‌న్నిహితుల‌కే తెలియ‌డం లేద‌ట‌. ఇక అధికారులైతే మంత్రి అర్ధ‌రాత్రి ప‌ర్య‌ట‌న‌ల‌తో త‌మ‌కు నిద్ర‌, నిప్పులు లేకుండా పోతున్నాయ‌ని వాపోతున్నార‌ట‌. సెల‌వు రోజులు, ఆదివారాలు అని కూడా చూడ‌కుండా నారాయ‌ణ ప‌ర్య‌ట‌న‌ల‌తో హ‌డావిడి చేస్తుండ‌డంతో వారు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నార‌ట‌. అయితే జిల్లాలో చాలా మంది మాత్రం నారాయ‌ణ జిల్లాకు వ‌చ్చే ముందు ప‌క్కా ప్లానింగ్‌ తో వ‌స్తే కాస్త ప‌నులు అవ్వ‌డంతో పాటు అంద‌రికి ఉప‌యోగం ఉంటుంద‌ని చెపుతున్నార‌ట‌. మ‌రి ఇక‌నైనా నారాయ‌ణ త‌న రూటు మారుస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News