ఇండియాలో ఇప్పటికే మోదీయే హీరో

Update: 2018-04-13 16:10 GMT
నాలుగేళ్ల కిందట నీరాజనాలు అందుకుని ఇప్పుడు నిత్యం విమర్శలు పాలవుతున్న ప్రధాని మోదీకి ఇంతకీ జనంలో ఆదరణ ఉన్నట్లా.. పోయినట్లా? విపక్షాలు చెబుతున్నదీ.. నెటిజన్లు తిడుతున్నదీ చూస్తుంటే మోదీ తన మునుపటి ప్రభ కోల్పోయినట్లుగా కనిపిస్తుంది. కానీ.. అంతర్జాతీయ సంస్థల సర్వేల్లో మాత్రం ఇప్పటికీ ఆయన స్టార్ హోదాలోనే ఉన్నారు. తాజాగా బ్రిటన్‌ కు చెందిన ‘యూగవ్‌’ సంస్థ ఈ ఏడాదికి గానూ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో నరేంద్ర మోదీ - బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ టాప్‌-10లో నిలిచారు. దీంతో విపక్షాలు చేస్తున్న మోదీ వ్యతిరేక ప్రచారం ప్రభావం ఏమైందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
    
అయితే... యూగవ్‌ సంస్థ సర్వేను ప్రాతిపదికగా తీసుకోలేమన్న వాదనా వినిపిస్తోంది. యూగవ్ భారత్ తో పాటు మరో 34 దేశాల్లో ఈ సర్వే చేసింది. 37,500 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది. అంటే... సగటున సుమారు 1100 మంది అభిప్రాయాలతో వెల్లడించిన అభిప్రాయంగా దీన్ని భావించాలి. వందల కోట్ల మంది ఉన్నభారతదేశం మూడ్‌ను ఇంత తక్కువమంది అభిప్రాయం ఎలా ప్రతిబింబిస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
    
ఈ విషయాన్ని పక్కనపెట్టి జాబితాలోకి చూస్తే... ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అగ్రస్థానంలో నిలవగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రెండు, సినీ నటుడు జాకీ చాన్‌ మూడు, చైనా అధ్యక్షుడు జింగ్‌ పింగ్‌లు నాలుగో స్థానాల్లో ఉన్నారు.  ప్రపంచ జాబితాలో మోదీ ఎనిమిదో స్థానంలో నిలవగా, అమితాబ్‌ బచ్చన్‌  తొమ్మిదో స్థానంలో నిలిచారు.
    
ఇక మహిళల విభాగంలో హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ అగ్రస్థానంలో నిలవగా, ఒబామా భార్య మిషెల్లీ మహిళల రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్‌ నటీమణులు ఐశ్వర్య రాయ్‌ ఈ జాబితాలో 11వ స్థానంలో, ప్రియాంక చోప్రా 12వ స్థానంలో, దీపికా పదుకొణె  13వ స్థానంలో నిలిచారు.
Tags:    

Similar News