ప‌టేల్‌.. అంబేడ్క‌ర్ మిక్స్ చేస్తే మోడీనా!

Update: 2017-09-18 06:36 GMT
బ‌ల‌మైన భావోద్వేగాల్ని స‌రిగా మిక్స్ చేస్తే దాని వ‌ల్ల ఒక‌గూరే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి ప్ర‌య‌త్న‌మే ఒక‌టి షురూ అయ్యింది. దేశ రాజ‌కీయాల్లో త‌న‌దైన రీతిలో దూసుకుపోతున్న మోడీని భావి భార‌త అంబేడ్క‌ర్ ని చేసే వ్యూహం ఒక‌టి సిద్ధ‌మైంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నిజాయితీగా ప‌ని చేసి.. స‌రైన స్థానంలో కూర్చోలేని నాయ‌కుల్లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఒక‌రు.

ప్ర‌ధానిగా నెహ్రు స్థానే ప‌టేల్ కానీ ప‌గ్గాలు చేప‌ట్టి ఉంటే దేశ ముఖచిత్రం మ‌రోలా ఉండి ఉండేద‌న్న భావ‌న నేటికీ దేశ ప్ర‌జ‌ల్లో అత్య‌ధికుల‌కు ఉంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ఈ విష‌యాన్ని మోడీ బ్యాచ్ బాగానే అర్థం చేసుకుంద‌ని చెప్పాలి. అదే స‌మ‌యంలో.. అంబేడ్క‌ర్‌ కు ఉన్న ఇమేజ్‌ ను త‌మ సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ అండ్ కో ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో మ‌రే రాజ‌కీయ పార్టీ కూడా ఆలోచించ‌ని రీతిలో రెండు భిన్న ముఖాల్ని ఒక‌చోట‌కు చేర్చ‌ట‌మే కాదు.. రెండింటిని మిక్స్ చేసి భారీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌మ‌ల‌నాథుల తీరును చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌ధాని మోడీ 67వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న సంద‌ర్భంగా ఆయ‌నకు అత్యంత స‌న్నిహితుడు.. నీడ‌లాంటి అమిత్ షా చేసిన వ్యాఖ్య ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంద‌ని చెప్పాలి.

మోడీని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్క‌ర్ తో పాటు.. తొలి ఉప ప్ర‌ధాని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ తో పోల్చ‌టం గ‌మ‌నార్హం. అంబేడ్క‌ర్ .. ప‌టేల్ ఇద్ద‌రు సామాజిక.. భౌగోళిక ఏకీక‌ర‌ణ‌కు పాటు ప‌డ్డార‌ని మోడీ ఆర్థిక సంఘటితానికి కృషి చేశార‌న్నారు.

మోడీ జీవితం దేశ స్ఫూర్తికి చిహ్నంగా అభివ‌ర్ణించిన అమిత్ షా.. అంబేడ్క‌ర్ ప్ర‌స్తావ‌న‌ను అదే ప‌నిగా తీసుకురావ‌టం క‌నిపిస్తుంది. పేద‌ల ప‌రిస్థితిని అర్థం చేసుకొని చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల్ని మోడీ ప్ర‌వేశ పెట్టారంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన అమిత్ షా.. అంబేడ్క‌ర్ తో ఆయ‌న్ను పోల్చ‌టం ఒక ఎత్తు అయితే.. విఫ‌ల య‌త్నంగా ఆర్థిక నిపుణులు.. మేధావులంద‌రి విమ‌ర్శ‌లు పొందుతున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీలు ఆర్థిక సంఘ‌టితానికి బాట‌లు వేస్తున్న‌ట్లుగా పేర్కొన‌టం విశేషం. ఏది ఏమైనా.. మోడీని అభిన‌వ అంబేడ్క‌ర్‌.. ప‌టేల్ గా ప్రొజెక్ట్ చేయాల‌న్న సందేశాన్ని త‌న మాట‌ల‌తో అమిత్ షా క‌మ‌ల‌నాథుల‌కు చెప్పేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News