మోదీ మాట‌!... క‌న్న‌డ సీఎం క్లర్కే!

Update: 2019-01-13 16:39 GMT
క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీ ప‌డ్డాయి. అయితే ఈ రెండు పార్టీలు ఎంత గింజుకున్నా... కింగ్ మేక‌ర్‌ను తానేన‌నంటూ ప్ర‌క‌టించేసుకున్న జేడీఎస్ నేత‌, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమార‌స్వామి... తాను అనుకున్న‌దానికంటే కూడా మెరుగైన ఫ‌లితాల‌ను సాధించి... కింగ్ మేక‌ర్ స్థాయి నుంచి ఏకంగా కింగ్‌గా అవ‌తరించారు. బీజేపీకి చెక్ పెట్టే దిశ‌గా యోచించిన కాంగ్రెస్ పార్టీ కుమార‌కు సీఎం ప‌ద‌విని ఇచ్చేందుకు అంగీక‌రించి... బీజేపీ నేత‌, ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప‌కు నిజంగానే షాకిచ్చింది. ఈ తంతు జ‌రిగిన స‌మ‌యంలో దేశంలోని అంద‌రి చూపు క‌న్న‌డ పాలిటిక్స్ వైపుగానే ఉండిపోయింది. ఎప్పుడేం జ‌రుగుతుంద‌న్న ఉత్కంఠ‌తో పాటు అక్క‌డ చోటుచేసుకుంటున్న కీల‌క మ‌లుపులు, ప‌దునైన వ్యూహాల‌ను ఆసక్తిగా ప‌రిశీలించారు.

అయినా ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై దృష్టి సారించాల్సింది పోయి... ఎప్పుడో జ‌రిగిపోయిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై చ‌ర్చ ఎందుకు అంటారా?  నాడు కింగ్‌గా అవ‌త‌రించిన సీఎం కుమార‌స్వామి... అస‌లు కింగ్‌గా ఉన్నాడా?  లేదంటే బంట్రోతుగా ఉన్నాడా? అన్న విష‌యం ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారిపోయింది. అదే స‌మ‌యంలో సీఎం కుర్చీలోనే కూర్చున్న‌ప్ప‌టికీ... త‌న ప‌రిస్థితి క్ల‌ర్క్ కంటే హీనంగా త‌యారైంద‌ని మొన్న‌టికి మొన్న స్వ‌యంగా కుమార స్వామే ఏడ్చేసినంత ప‌నిచేశారు. ఆ విష‌యం ఎలా తెలిసిందో గానీ... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... కుమార‌పై అదిరిపోయే పంచ్ సంధించారు. కుమార ఆవేద‌న‌తో కూడిన మాట‌ను మోదీ ఎగ‌తాళి చేయ‌డంతో పాటుగా బీజేపీకి ఎదురొడ్డి పోరాడుతున్న కాంగ్రెస్‌, జేడీఎస్ కూట‌మి అంత స‌ఖ్య‌త‌గా లేద‌న్న కోణంలో వాగ్బాణాలు సంధించారు.

అయినా మోదీ ఏమ‌న్నారంటే... క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామి... సీఎంగా ప‌నిచేయాల్సింది పోయి ఓ క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎంగా ఉన్న కుమార స్వేచ్ఛ‌గా ప‌నిచేసే వాతావ‌ర‌ణం లేద‌ని, ఏ ప‌ని చేయాల‌న్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు, కేబినెట్ లోని ఆ పార్టీ మంత్రులు కుమార‌కు అడ్డుప‌డుతున్నార‌ని, దీంతో కుమార సీఎం కుర్చీలో కూర్చున్నా... క్ల‌ర్క్ మాదిరిగా ప‌నిచేసుకోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని మోదీ విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల‌పై జేడీఎస్ నేత‌ల కంటే ముందే మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు మోదీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పికొట్టేందుకు య‌త్నించినా పెద్ద‌గా ఫ‌లితం క‌నిపించ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News