కాపీ కొట్ట‌టం కూడా మోడీకి రాదా?

Update: 2019-02-01 09:16 GMT
అనుకున్న‌దే అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌ధాని మోడీ మ‌న‌సును ఎంత‌లా ప్ర‌భావితం చేసిందో తాజా బ‌డ్జెట్ ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. కేసీఆర్ విజ‌యంలో క‌రెంటు.. రైతుబంధు కీల‌క‌పాత్ర పోషించిన వైనం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రైతుబంధు త‌ర‌హాలోనే కేంద్రం త‌న ప‌థ‌కాన్ని తాజా బ‌డ్జెట్ లో ప్ర‌వేశ పెట్టింది. కాపీ కొట్టేట‌ప్పుడు మాతృక‌ను మించి ఉండాలే కానీ.. దాని కంటే త‌క్కువ‌గా ఉంటే పేరు త‌ర్వాత‌.. విమ‌ర్శ‌లు ప‌క్కా.

తాజాగా మోడీ మాష్టారి ప‌రిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. కేసీఆర్ అమ‌లు చేస్తున్న రైతుబంధు ప‌థ‌కాన్ని అడ్డంగా కాపీ కొట్టేసిన మోడీ.. కిసాన్ స‌మ్మాన్ నిధి పేరుతో ప‌థ‌కాన్ని అనౌన్స్ చేశారు. కేసీఆర్ రైతుబంధు ప‌థ‌కంలో ప్ర‌తి ఏటా రెండుసార్లు చొప్పున ఎక‌రానికి రూ.4వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు దాన్ని కాస్తా ఎక‌రానికి రూ.5వేలు చొప్పున ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌టం తెలిసిందే.

కేసీఆర్ ఇంత భారీగా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టిస్తే.. దాన్ని కాపీ చేసిన మోడీ మాత్రం అందుకు భిన్నంగా ఐదు ఎక‌రాల్లోపు  ఉన్న రైతుల‌కు ఏడాదికి రూ.6వేల చొప్పున సాయాన్ని అందిస్తామ‌ని పేర్కొన్నారు. అది కూడా మూడు ద‌ఫాల్లో రూ.2వేలు చొప్పున ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంటే.. తెలంగాణ‌లోని రైతు ఎక‌రానికి ఏడాదిలో అందే సాయంతో పోలిస్తే.. మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన ఐదు ఎక‌రాల్లోపు సాయం చాలా.. చాలా త‌క్కువ‌ని చెప్పాలి.

తాజాగా తాము ప్ర‌క‌టించిన ప‌థ‌కం కోసం ఏడాదికి రూ.75వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధం లేకుండా తాము ప్ర‌క‌టించిన మొత్తం నేరుగా రైతు ఖాతాలోకి పంపుతామ‌ని గోయ‌ల్ తెలిపారు. మోడీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఈ రైతు సాయం కేసీఆర్ రైతుబంధుతో పోలిస్తే ఏ మాత్రం సూట్ కాద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

కేసీఆర్ రైతుబంధుతో 58 ల‌క్ష‌ల మంది ల‌బ్థి పొందుతుండ‌గా.. త‌మ ప‌థ‌కంతో దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు లాభం పొందుతార‌ని చెబుతున్నారు. రైతుబంధు కోసం వార్షిక బ‌డ్జెట్ లో కేసీఆర్ రూ.15వేల కోట్లు కేటాయించ‌గా.. మోడీ స‌ర్కారు రూ.75వేల కోట్లు కేటాయించింది. ఒక రాష్ట్ర బ‌డ్జెట్‌ లో కేసీఆర్ ఖ‌ర్చు చేస్తున్న మొత్తంతో పోలిస్తే.. మోడీ స‌ర్కారు ఖ‌ర్చు చేస్తున్న మొత్తం స్వ‌ల్పంగా ఉంటుంద‌ని చెప్పాలి. బ‌డ్జెట్‌ లో ప్ర‌క‌టించిన ఈ సాయం కార‌ణంగా.. ఈ ప‌థ‌కానికి మూల‌మైన కేసీఆర్ దేశ వ్యాప్తంగా హీరో కావ‌టం ఖాయం. మొత్తానికి కాపీ కొట్టుడేమో కానీ.. మోడీ కంటే కేసీఆర్‌ కే మైలేజీ ఎక్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News