మోడీ మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి వ‌చ్చిన 4 రోజుల‌కు ఆ ప‌ని చేశార‌ట‌!

Update: 2019-06-28 05:00 GMT
అధికారం మ‌హా సిత్ర‌మైంది. దాని ప‌వ‌ర్ ఎంత‌న్న‌ది దాన్ని ప్ర‌యోగించే వాడి స‌త్తాకు త‌గ్గ‌ట్లు ఉంటుంది. అంద‌రి చేతుల్లో అధికారం ఉన్నా.. దాన్ని ఎలా వాడాల‌న్న విష‌యం మీద మాత్రం కొంద‌రికి ఉండే టాలెంట్ వేరుగా ఉంటుంది. ఎందుకిందంతా అంటే.. ప‌దేళ్ల పాటు ప్ర‌ధాన‌మంత్రి హోదాలో ఉండి.. వ్య‌క్తిగ‌తంగా వేలు పెట్ట‌లేని రీతిలో వ్య‌వ‌హ‌రించిన నేత‌గా మ‌న్మోహ‌న్ సింగ్ కు పేరుంది. అలాంటి ఆయ‌న విష‌యంలో ప్ర‌ధాని మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరుకాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇటీవ‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి.. రెండోసారి ప్ర‌ధాని పీఠాన్ని అధిష్ఠించిన మోడీ.. ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాలుగు రోజుల‌కు ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మాజీ ప్ర‌ధానిగా గ‌డిచిన ఐదేళ్లుగా ఉన్న వ్య‌క్తిగ‌త సిబ్బందిని భారీగా కోత విధిస్తూ మోడీ మాష్టారు నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ప్ర‌ధాని హోదాలో ఉన్న‌ప్పుడు ఉండే మంది మార్బ‌లంతో పోలిస్తే.. మాజీ హోదాలో ఆ హంగు దాదాపుగా త‌గ్గిపోతుంది.

దాంతో స‌రిపుచ్చ‌కుండా మాజీ  ప్ర‌ధానికి కేటాయించే వ్య‌క్తిగ‌త సిబ్బంది అంశంలోనూ కోత విధించ‌టంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. మాజీ ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ కు 14 మంది సిబ్బంది ప‌ని చేస్తుంటారు. దాని స్థానే ఐదుగురు సిబ్బందికి త‌గ్గిస్తూ మోడీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు మే 25న జారీ అయ్యాయి. దీంతో.. ప్ర‌ధాని మోడీకి మ‌న్మోహ‌న్ ఒక లేఖ రాశారు. త‌న సిబ్బందిని త‌గ్గించే విష‌యంలో జారీ చేసిన ఉత్త‌ర్వుల్ని నిలిపివేయాల‌ని కోరారు. మొత్తానికి పెద్ద మ‌నిషి చేత ప్లీజ్ అనిపించేలా లేఖ రాయించుకోవ‌టంలో మోడీ మాష్టారు స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.


Tags:    

Similar News