మోడీ దెబ్బ : ఒక చీలిక – ఒక కలయిక!

Update: 2017-08-03 04:20 GMT
ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ప్రచారం చాలా విస్తృతంగా లభిస్తూ ఉంటుందని అంతా అంటుంటారు. కానీ నిజానికి ఆయన పరిపాలన గురించి మాత్రమే ఎక్కువ ప్రచారం జరుగుతుంటుంది. ఆయనలోని రాజకీయ చాణక్యనీతి గురించి, వ్యూహ చాతుర్యం గురించి జరిగే ప్రచారం తక్కువ. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే కూటమి బలం పెంచడానికి మోడీ అనుసరిస్తున్న విధానాలు, దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని - ఒక్కో పార్టీని తన పట్టులోకి తెచ్చుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తోంటే.. ఈ సంగతి తేలుతోంది. ప్రస్తుత పరిణామాల్లో మోడీ దెబ్బకు ఒక చీలిక- ఒక కలయిక అన్నట్లుగా రెండు రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలు రూపురేఖలు మార్చుకున్నాయి.

తమిళనాడులో చీలిక వర్గాలుగా కనీసం పార్టీ గుర్తుకు కూడా దూరమై కొట్టుకుంటున్న అన్నా డీఎంకే వర్గాలు ఒక్కమాటతో జట్టుకట్టేశాయి. అలాగే ఎన్డీయేలో కూడా భాగస్వామిగా చేరిపోయాయి. ఈ రెండు వర్గాల కలయిక ఇక్కడ సాద్యమైంది.

అదే సమయంలో బీహార్లో మాత్రం పాలక పార్టీ రెండు ముక్కలుగా మారిపోతున్నది. సీఎం నితీశ్ కుమార్ మహాకూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేసి, భాజపాతో జట్టుకట్టి, ఎన్డీయేలో చేరిపోయి తిరిగి అధికారం దక్కించుకున్న తీరును పార్టీ నాయకులు శరద్ యాదవ్ జీర్ణించుకోవడం లేదు. నితీశ్ పై ఆయన ఇప్పటికే పలు విమర్శలు చేశారు. మహా కూటమి ఏర్పాటుకు చాలా కష్టపడ్డామని, దాన్ని ఆయన నాశనం చేశారని అన్నారు. అయితే తాజా వార్తల ప్రకారం.. శరద్ యాదవ్ జేడీయూ నుంచి బయటపడి తాను వేరే కొత్త పార్టీ స్థాపించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. మోడీ దెబ్బకు నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ చీలిపోయినట్లుగా  భావించాలి. ఈ పరిణామం ఆ పార్టీకి స్వల్పంగానైనా నష్టదాయకమే అవుతుంది కూడా!

చిరంజీవి హీరోగా నటించిన స్టేట్ రౌడీ చిత్రంలో విలన్ ఒక వ్యక్తిని హత్య చేయిస్తాడు.. అలాగే దీపపు సెమ్మె నూనెలో పడి కొట్టుకుంటున్న చీమను కాపాడుతాడు. ‘‘ఒక ప్రాణం తీశా.. ఒక ప్రాణం పోశా.. లెవెలైపోయింది..’’ అనే డైలాగు వేస్తాడు. ఇప్పుడు నరేంద్రమోడీ వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉన్నట్లుంది. ఆయన దెబ్బకు ఒక రాష్ట్రంలో పాలక పార్టీలో చీలక, ఒక రాష్ట్రంలో పాలక పార్టీలో కలయిక.. లెవెలైపోయాయి!!
Tags:    

Similar News