మోడీ ఫెయిల్..ఈ విషయంలో పక్కా..

Update: 2019-02-01 09:57 GMT
సార్వత్రిక ఎన్నికల ముందర బీజేపీ ప్రభుత్వానికి దిమ్మదిరిగే ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగి 45 ఏళ్ల గరిష్టానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్ ఎస్ ఎస్ ఓ) నివేదిక బయటకొచ్చింది.. ప్రముఖ జాతీయ మీడియా సంస్థలన్నీ ఈ నివేదికను ప్రచురించడంతో బీజేపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. మోడీ వైఫల్యం.. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధమైంది.

2016 తర్వాత నిరుద్యోగులపై ఎన్ ఎస్ ఎస్ ఓ సర్వే చేపట్టడం ఇదే ప్రథమం. ఈ నివేదిక ప్రకారం దేశంలో 2017-18 మధ్య నిరుద్యోగ రేటు 6.1 శాతంగా నమోదైందని పేర్కొంది. 1972-73 తర్వాత ఇంత భారీ స్థాయిలో నిరుద్యోగ రేటు పెరగడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉండగా.. గ్రామాల్లో అయితే 5.3శాతంగా నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఉద్యోగ కల్పన సర్వేను కేంద్రం కావాలనే బయటకు రాకుండా దాచేసింది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే తాజాగా జాతీయ గణాంకాల  సంఘం నుంచి ఇద్దరు సభ్యులు మోహనన్ - మీనాక్షిలు రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..  కాగా యూపీఏ పాలనలో కన్నా.. ఎన్టీఏ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు వీలుగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)ని లెక్కించే ప్రమానాలు మార్చడంపై కూడా జాతీయ గణంకాల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వీరి రాజీనామా జాతీయ స్థాయిలో దుమారం రేపింది. కేంద్రంపై ఒత్తిడి పెంచింది. త్వరలోనే ఈ నిరుద్యోగిత సర్వే నివేదికను విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంది. కానీ ఈలోగానే నివేదిక బయటకు వచ్చింది. కేంద్ర బడ్జెట్ కు ఒకరోజు ముందే ఈ నివేదిక బయటకు రావడం మోడీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది.
Tags:    

Similar News