తేడా అనిపిస్తే చాలు కట్ చేసి పారేయటమే!

Update: 2019-12-28 04:49 GMT
ప్రధాని మోడీ మాష్టారికి కొన్ని విషయాల్లో అస్సలు మొహమాటాలు అన్నవే ఉండవన్నట్లుగా వ్యవహరిస్తారు. ఏవరేం అనుకున్నా ఫర్లేదు.. తాను అనుకున్న పనిని చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకు అడ్డు వచ్చిన వాటి విషయాల్లో ఆయనెంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అన్నది ఎంత కీలకంగా మారిందో తెలిసిందే.

అందునా జియో పుణ్యమా అని రోజూ జీబీల కొద్దీ డేటాను ఇట్టే వాడేయటం ఒక అలవాటుగా మారింది. నచ్చిన అంశమే కాదు.. అందుకు సంబంధించిన ఫోటోలు.. వీడియోల్ని తెగ షేర్ చేసే అలవాటు నేపథ్యంలో మోడీ మాస్టారి ప్రభుత్వ చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దేశంలో ఎక్కడ చిన్న తేడాగా అనిపించినా.. తొలుత ఇంటర్నెట్ మీద కొరడా విదులుస్తున్న వైనం పెరుగుతోంది.

తాజాగా పౌరసత్వ సవరణ చట్టం మీద దేశ వ్యాప్తంగా సాగుతున్న రచ్చ ఒక ఎత్తు అయితే.. ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి మరో ఎత్తు అన్నట్లుగా ఉందంటున్నారు. దీంతో..  ఆ రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఇంటర్నెట్ ను నిలిపివేశారు. రోజులు కొద్దీ సాగుతున్న ఈ కటింగ్  తీరుపై వివిధ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన తర్వాత తరచూ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతుందని చెబుతున్నారు.

ఆర్టికల్ 370 నిర్వీర్యం నేపథ్యంలో జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలే కాదు టెలిఫోన్ సేవల్ని బంద్ చేయటం తెలిసిందే. ఆగస్టు ఐదున నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలు నేటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా పునరుద్దరించకపోవటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కరోజు ఇంటర్నెట్ లేదంటేనే ఆగమాగమయ్యే పరిస్థితి. నిత్యజీవితంలోనూ పలు అంశాలు ఇంటర్నెట్ తో అనుసంధానమైన వేళ.. నెట్ లేకుండా నెలల తరబడి ఉండటం కష్టమైన పనిగా చెప్పక తప్పుదు.

ఒక్క జమ్ముకశ్మీర్ లో మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు సందర్భాల్లో కాస్త తేడా అనిపించినంతనే ఇంటర్నెట్ సేవలపై కొరడా విదులుస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈ ఏడాదిలో వందసార్లకు పైనే ఇంటర్నెట్ కట్ చేసిన అరుదైన ఘనత మోడీ సర్కారు సొంతం చేసుకుందని చెప్పకతప్పదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇలా ఇంటర్నెట్ ను అదే పనిగా ఆపేయటం అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న మాట వినిపిస్తోంది. 2017లో 79 సార్లు కట్ చస్తే 2018లో అది ఏకంగా 134 సార్లు అయ్యింది. ఈ ఏడాది 100 సార్లు ఇంటర్నెట్ ను నిలిపివేశారు. 2012 నుంచి ఇప్పటివరకూ 370 సార్లు ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధిస్తే.. అందులో సింహభాగం మోడీ మాస్టారి హయాంలోనే ఉండటం గమనార్హం.


Tags:    

Similar News