మ‌రో దుష్ట సంప్ర‌దాయానికి మోడీ తెర తీశారా?

Update: 2019-02-01 10:48 GMT
దాదాపు ఐదేళ్ల క్రితం మోడీ ప్ర‌ధాని ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్న వేళ‌.. ఆయ‌న్ను వ్య‌తిరేకించేటోళ్లు సైతం ఈసారికి మోడీకి అవ‌కాశం ఇచ్చి చూస్తే ఏం న‌ష్ట‌మ‌న్న‌ట్లుగా మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. ఇలాంటి సానుకూల‌త ఆయ‌న‌కు బంప‌ర్ మెజార్టీని తెచ్చేలా చేయ‌ట‌మే కాదు.. దేశంలో అత్యంత శ‌క్తివంత‌మైన నేత‌గా ఎదిగారు.

చాలా ఏళ్ల త‌ర్వాత పూర్తిస్థాయిలో మెజార్టీతో పాటు.. తిరుగులేని అధిక్య‌త చేతిలో ఉండ‌టంతో ఆయ‌న ఏం చేయాల‌నుకుంటే అది చేసే ప‌రిస్థితి. కేంద్రం పెద్ద‌న్న‌పాత్ర‌ను పోషించ‌టం కంటే కూడా.. రాష్ట్రాల‌ను బ‌ల‌హీనం చేసేలా పావులు క‌దిపిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేనా.. త‌న‌రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో దేశంలో మ‌రే కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌న‌టువంటి తీరులో ఆయ‌న నిర్ణ‌యాలు ఉన్నాయ‌ని చెబుతారు. మోడీ హ‌యాంలో ముఖ్య‌మంత్రి స్థాయి నేత‌ను సైతం ప‌లు సంస్థ‌లు త‌నిఖీలు చేయ‌టం గ‌తంలో ఇప్పుడు జ‌రిగినంత ఎక్కువ‌గా జ‌ర‌గ‌లేద‌ని చెబుతారు.

ఇక‌.. వ్య‌వ‌స్థ‌ల్ని నిర్వీర్యం చేసే విష‌యంలోనూ మోడీ త‌ర్వాతే ఇంకెవ‌రైనా అన్న మాట వినిపిస్తోంది. గ‌డిచిన ప‌ది.. పదిహేనేళ్ల‌లో సీబీఐ ఎప్పుడూ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొన‌లేద‌ని చెబుతారు. సీబీఐ చీఫ్ ఎంపిక ఎప్పుడూ ఇంత వివాదం కాలేద‌ని చెబుతారు. ఇక‌.. మీడియాపై ప‌రిమితుల విష‌యంలోనూ మోడీ కొత్త రికార్డులు సృష్టించార‌ని చెప్పాలి.

ఇక‌.. కేంద్ర‌మంత్రుల‌తో మోడీ సంబంధాలు.. సొంత పార్టీ నేత‌ల‌తో ఆయ‌న‌కున్న ద‌గ్గ‌ర‌ త‌నం మీద చాలానే ప్ర‌శ్న‌లు ఉన్నాయి. మిత్రుల‌ను దూరం చేసుకోవ‌టంలోనూ మోడీ ట్రాక్ రికార్డు మా గొప్ప‌గా ఉంటుంద‌ని చెప్పాలి. ఇలా మోడీ మీద చాలానే ఫిర్యాదులు ఉన్నాయి.

ఇలాంటి వేళ‌.. మ‌రో మ‌ర‌క మోడీ స‌ర్కారుకు అంటిన‌ట్లుగా ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌రో రెండు..మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ‌.. ఇంటీరియ‌మ్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టే క్ర‌మంలో గ‌తంలో అనుస‌రించిన హ‌ద్దుల్ని చెరిపేసి.. పూర్తిస్థాయి బ‌డ్జెట్ త‌ర‌హాలో నిర్ణ‌యాలు.. తాయిలాలు ప్ర‌క‌టించ‌టం చూస్తే..మోడీ నైతిక‌త విష‌యంలో అంద‌రి వేళ్లు త‌న‌వైపు చూపించేలా చేశార‌ని చెబుతున్నారు. ఈ త‌ర‌హా సంప్ర‌దాయం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు.

ఎన్నిక‌ల ఏడాది అధికార‌ప‌క్షం ప్ర‌వేశ పెట్టే బ‌డ్జెట్ నామ‌మాత్రంగానే ఉండాలి. ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చే ప్ర‌భుత్వం చేతిలో ఐదేళ్ల పాల‌న ఉంటుంది. తాను ప‌వ‌ర్లోకి వ‌చ్చిన వెంట‌నే త‌న ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా ప్లాన్ సెట్ చేసుకునేలా ఉండాలి. గ‌డిచిన నాలుగేళ్లుగా బ‌డ్జెట్ కేటాయింపులు లేని వివిధ వ‌ర్గాల‌కు ఎన్నిక‌ల ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించ‌టం ఏ మాత్రం మంచి సంప్ర‌దాయం కాదంటున్నారు.

ఈ త‌ర‌హా ధోర‌ణి స‌రికాద‌ని.. ఇది నైతిక‌త‌కు సంబంధించిన అంశంగా చెబుతున్నారు. కేవ‌లం మూడు నెల‌ల పాల‌న మాత్ర‌మే చేతిలో ఉన్న ప్ర‌భుత్వం.. ఏడాది మొత్తానికి బ‌డ్జెట్ ఎలా ప్ర‌వేశ పెడ‌తార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు త‌లెత్తుతుంది. విలువ‌లు.. సంప్ర‌దాయాల్ని ప‌క్క‌న పెట్టేసి త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం మాత్ర‌మే చూసే మోడీ లాంటి నేత నేతృత్వంలో ఇంత‌కు మించి ఎక్కువ ఆశించ‌లేమేమో?
Tags:    

Similar News