ఏపీని మ‌ళ్లీ దారుణంగా దెబ్బేసిన మోడీ!

Update: 2018-07-31 05:17 GMT
ఏపీ అంటే చాలు.. అస్స‌లు గిట్ట‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి ప్ర‌ధాని మోడీలో అంత‌కంత‌కూ ఎక్కువైపోతోంది. మిత్రుడిగా క‌లిసి ఉన్న‌ప్పుడు సైతం ఏపీ మీద త‌న‌కున్న అక్క‌సును త‌న చేత‌ల‌తో అర్థ‌మ‌య్యేలా చేశార‌ని చెప్పాలి. విభ‌జ‌న కార‌ణంగా ఆర్థికంగా చితికిపోయిన ఏపీ రాష్ట్ర రాజ‌ధాని శంకుస్థాప‌న సంద‌ర్భంగా బిందెడు మట్టి.. మ‌రో బిందెడు నీళ్లు తీసుకురావ‌టంతోనే.. ఏపీకి సాయం విష‌యంలో త‌న స‌మాధానం ఏమిటో చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఇటీవ‌ల కాలంలో తాను తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌ల్లో త‌న‌పై పెరిగిన ఆగ్ర‌హానికి బ‌దులు తీర్చుకునేలా మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ నేత దాఖ‌లు చేసిన ఒక పిటిష‌న్లో మోడీ స‌ర్కారు బ‌దులిస్తూ.. ఏపీకి  భారీ న‌ష్టం వాటిల్లేలా స‌మాధానం చెప్పి క‌సి తీర్చుకుంది. విభ‌జ‌న హామీల అమ‌లుపై పొంగులేటి సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. దీనిపై స‌మాధానం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో త‌న వాద‌న‌ను వినిపిస్తూ.. ఏపీ గొంతు నొక్కేసేలా తాజాగా కొత్త మాట‌ను చెప్పింది.

విభ‌జ‌న సంద‌ర్భంగా ఇంకా లెక్క‌లు తేల‌ని ఉమ్మ‌డి సంస్థ‌ల‌కు సంబంధించి ఏపీకి భారీ న‌ష్టం వాటిల్లేలా నిర్ణ‌యం తీసుకుంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు క‌ట్టిన ప‌న్నుల‌తో ఏర్పాటైన ఆస్తుల్ని పంచే విష‌యంలో ఏపీని ముంచేలా నిర్ణ‌యం తీసుకుంది. ధ‌ర్మంగా చూస్తే.. ఉమ్మ‌డి ఆస్తుల‌ను జ‌నాభా ప్రాతిప‌దిక‌న పంచుకోవాల్సి ఉంది. అలా పంచుకోవాల‌న్న విష‌యం ఉమ్మ‌డి విభ‌జ‌న చ‌ట్టంలో స్ప‌ష్టంగా పేర్కొన్నారు కూడా. అయిన‌ప్ప‌టికీ.. విభ‌జ‌న చ‌ట్టంలోని షెడ్యూల్ 10లో పేర్కొన్న సంస్థ‌ల‌న్నీ తెలంగాణ‌కే చెందుతాయ‌ని.. వాటి ఆస్తుల్ని పంచాల్సిన అవ‌స‌రం లేదంటూ కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. దీనిపై ఏపీ రాష్ట్ర వ‌ర్గాల్లో విస్మ‌యంతో పాటు.. ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

+ విభజన చట్టంలోని సెక్షన్‌ 47(1)ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న సంస్థల ఆస్తులు - అప్పులను ఇరు రాష్ట్రాలకు వాటి జనాభా దామాషా ప్రకారం పంచాలి. అదే చట్టంలోని సెక్షన్‌ 75... పదో షెడ్యూలులో చేర్చిన సంస్థల సేవలను పదేళ్ల వరకు ఇరు రాష్ట్రాలు పొందాలని పేర్కొన్నారు.

+  అంటే.. ఆ సంస్థ విభజన తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ - తక్షణం మరో రాష్ట్రానికి ఇబ్బంది తలెత్తకుండా చేసిన ఏర్పాటుగా చెప్పాలి.  పూర్తిగా సేవలు అందించేందుకు మాత్రమే పరిమితమైనది! కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిబంధనను చూపిస్తూ - పదో షెడ్యూలు సంస్థలు కేవలం సేవలు అందించేందుకు మాత్రమేనని చెబుతోంది.

+ ఆశ్చ‌ర్య‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. స‌ద‌రు సంస్థ‌ల ఆస్తులు.. అప్పుల‌ను జనాభా ప్రాతిపదికన పంచాలని అదే చట్టంలో ఉన్న సెక్షన్‌ 47(1)ను మాత్రం పట్టించుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సంస్థ‌ల‌న్ని.. అన్ని ప్రాంతాల ప్రజల కోసం - అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయంతో ఏర్పాటు చేశారు.

+ తొలుత 107 సంస్థలను మాత్రమే చేర్చారు. మరో 35 సంస్థలు కూడా ఉమ్మడిగా ఏర్పాటైనవేనని - వాటిని కూడా 10వ షెడ్యూలులో చేర్చాలని ఏపీ సర్కారు ఆ తర్వాత విన్నవించింది. వాటి ఆస్తులను కూడా ఇరు రాష్ట్రాలకు పంచాలని కోరింది.

+ ఈ మొత్తం సంస్థ‌ల్లో నాలుగైదు మాత్ర‌మే ఏపీలో ఉంటే.. మిగిలివ‌న్నీ ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌ధాని అయిన హైద‌రాబాద్‌ లోనే ఉన్నాయి. తాజాతా కేంద్రం వినిపిస్తున్న వాద‌న ఏమిటంటే.. అస‌లు ఆస్తులు.. అప్పుల‌ను విభ‌జించ‌ట‌మే కుద‌ర‌ద‌ని. అదే జ‌రిగితే ఏపీకి భారీగా న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం పొంచి ఉంది.

+ ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మ‌డి సంస్థల ఆస్తుల విలువ రూ.33వేల కోట్లు. ఆస్తుల విలువ పక్కనపెడితే... వాటి వద్ద ఉన్న నగదు నిల్వలే రూ.4 వేల కోట్లు! వీటిని దామాషా ప్రకారం అంటే.. 58:42 నిష్పత్తిలో పంచితే... ఏపీ రాష్ట్రానికి రావాల్సిన వాటా సుమారు 20 వేల కోట్ల రూపాయలు!

+ ప‌దో షెడ్యూల్ ఆస్తుల పంప‌కంపై రెండు రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వ ఏదైనా జ‌రిగితే.. కేంద్రం జోక్యం చేసుకొని ప‌రిష్క‌రించాలి. ఇరు రాష్ట్రాల‌కు ఆమోద‌యోగ్యంగా ఉన్న ఆస్తులు.. ఆప్పులు పంప‌కాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. కానీ.. అలాంటిదేమీ చేయ‌క‌పోగా.. ఏపీ ప‌ట్ల క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం
 
+ ఆస్తుల విభ‌జ‌న చేసే బాధ్య‌త ఉన్న‌కేంద్రం.. ఆస్తుల పంప‌కాన్ని ఆపేలా.. ఏపీకి మొండి చేయి చూపించేలా సుప్రీంలో అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

+ మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. పొంగులేటి దాఖ‌లు చేసిన వ్యాజ్యం.. రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న విభ‌జ‌న హామీల అమ‌లు సంగ‌తి చూడాల‌ని.. దానికి సంబంధం లేని ఆస్తుల పంప‌కంపై కేంద్రం వ్యాఖ్య‌లు చేయ‌టం ఏమిటి?  సుప్రీంలో కేంద్రం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ పుణ్య‌మా అని రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును సైతం ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉందా? అన్న సందేహం క‌లుగుతోంది. అదే జ‌రిగితే.. ఏపీకి మ‌రింత న‌ష్టం వాటిల్ల‌టం ఖాయం.
Tags:    

Similar News