వామ్మో మోడీ.. నువ్వు మామూలోడివి కాదు

Update: 2017-09-15 04:43 GMT
దేశంలో స‌మ‌స్య‌ల‌న్నీ ప‌క్క‌కు వెళ్లిపోయాయ్. క‌ల‌లు క‌న‌టం మొద‌లైంది. అందులోకి అలాంటి ఇలాంటి క‌ల కాదు. ఏకంగా బుల్లెట్ ట్రైన్ క‌లే. మామూలు రైళ్లకున్న డిమాండ్ తీర‌కున్నా.. మ‌న‌కు అవ‌స‌ర‌మో కాదో తేల‌ని బుల్లెట్ ట్రైన్‌ కి మాత్రం శంకుస్థాప‌న జ‌రిగిపోయింది.  ప్ర‌ధాని మోడీ.. జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే లు ఇద్ద‌రూ క‌లిసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును షురూ చేసేశారు.

2022 నాటికి ప‌ట్టాల మీద తిరిగే బుల్లెట్ ట్రైన్ లో తాను ప్ర‌యాణిస్తూ భార‌త్ అందాల్ని చూస్తాన‌ని జ‌పాన్ ప్ర‌ధాని వెల్ల‌డించారు. గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ నుంచి మ‌హారాష్ట్రలోని ముంబ‌యి మ‌ధ్య న‌డిచే ఈ ట్రైన్ కార‌ణంగా లబ్ది పొందేది ఎవ‌ర‌న్న దాని మీద ఎక్కువ సేపు మాట్లాడుకోవాల్సిన అవ‌స‌ర‌మేలేదు. వ‌జ్ర వ్యాపారులు.. ఆర్థికంగా బ‌ల‌మైన మూలాలు ఉన్న వ్యాపారుల‌కు మాత్ర‌మే ఈ బుల్లెట్ ట్రైన్ అక్క‌ర‌కు రానుంది. సామాన్యుడు.. స‌గ‌టు జీవి ఈ ట్రైన్ ఎక్కాల‌న్నా - ఎక్కే అవ‌కాశం ఉన్నా.. టికెట్ కొనే శ‌క్తి ఉంటుంద‌ని చెప్ప‌లేం.

రూ.ల‌క్ష కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి రెండు బ‌ల‌మైన ఆర్థిక మూలాలు ఉన్న న‌గ‌రాల మ‌ధ్య బుల్లెట్ రైలును న‌డిపే క‌న్నా.. అంతే మొత్తాన్ని భార‌త రైల్వేల‌కు మ‌రింత జ‌వ‌స‌త్వాలు నింపేందుకు ఉప‌యోగిస్తే ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండేది. కానీ.. బుల్లెట్ ట్రైన్ అన్న వెంట‌నే అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. మోడీ హ‌యాంలో చేప‌ట్టిన ప్రాజెక్టుగా క‌ల‌కాలం గుర్తు ఉండిపోవ‌టంతో పాటు.. భార‌త్‌కు బుల్లెట్ ట్రైన్ల‌ను ప‌రిచ‌యం చేసిన ప్ర‌ధానిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయే అరుదైన అవ‌కాశాన్ని మోడీ వ‌దులుకుంటార‌ని చెప్పలేం. ఈ కార‌ణంతోనే 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా  ఆవిష్క‌రించిన త‌న క‌ల‌ను ప‌ట్టాల మీద‌కు తీసుకొచ్చే ప‌నిని మోడీ షురూ చేశార‌ని చెప్పాలి.

ఇక్క‌డ మోడీ ద్వంద నీతిని ప్ర‌స్తావించ‌క త‌ప్ప‌దు. తాను ప‌దే ప‌దే ఆవిష్క‌రించిన బుల్లెట్ ట్రైన్ క‌ల‌ను సాకారం చేసేందుకు విప‌రీతంగా శ్ర‌మిస్తున్న మోడీ.. దేశ ప్ర‌జ‌ల జేబుల మీద భారం త‌గ్గించి.. వారు ఊహించ‌ని రీతిలో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గిస్తామ‌న్న హామీని మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. నిజానికి మోడీ త‌న మాట మీద నిల‌బ‌డ్డార‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఊహించ‌నంతగా పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల్ని తీసుకొస్తామ‌న్న త‌న హామీని ఆయ‌న ఇప్పుడు అమ‌లు చేస్తున్నార‌నే చెప్పాలి (త‌గ్గించ‌టం వ‌దిలేసి పెంచ‌టం ద్వారా).

తాను బుల్లెట్ ట్రైన్ క‌ల‌ను చెప్పిన‌ప్పుడు విప‌క్షాలు ఇది చాలాపెద్ద ప‌థ‌క‌మ‌ని పెద‌వి విరిచేవ‌ని..ఇప్పుడీ ప్రాజెక్టు మొద‌ల‌వుతుంటే బుల్లెట్ ట్రైన్ అవ‌స‌రం ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. వేగాన్ని పెంచి దూరాన్ని త‌గ్గించి.. ఆర్థికంగా పురోగ‌తిని సాధించాల‌న్న‌దే త‌మ సంక‌ల్పంగా మోడీ చెప్పారు. చిల‌క ప‌లుకులు చెప్పే మోడీ మాట‌ల మాయ ఎంత‌న్న‌ది భార‌తీయుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

దేశ వ్యాప్తంగా ప‌లు రైళ్ల రూట్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. వాటిని తీర్చే శ‌క్తి ఇండియ‌న్ రైల్వేల‌కు లేద‌న్న మాట పాల‌కులు చెబుతుంటారు. అప్పుడెప్పుడో బ్రిటీషోడు వేసిన రెండు వ‌రుస‌ల ప‌ట్టాల స్థానే.. మ‌రో వ‌రుస ప‌ట్టాల్ని ఏర్పాటు చేసే సామ‌ర్థ్యం లేద‌న్న మాట పాల‌కులు చెబుతుంటారు. సామాన్యుడికి మేలు చేసే ఈ త‌ర‌హా అంశాల మీద మోడీ ఎందుకు దృష్టి పెట్ట‌రు. ఖ‌రీదైన బుల్లెట్ ట్రైన్ మీద‌నే ఎందుకు దృష్టి పెడ‌తారు? అన్న ప్రాధ‌మిక‌ ప్ర‌శ్న వేసుకుంటే అస‌లు ముచ్చ‌ట బ‌య‌ట‌కు వ‌స్తుంది.

దేశ ప్ర‌జ‌లంద‌రికి మేలు చేసే మ‌రో వ‌రుస ప‌ట్టాల్ని ఏర్పాటు చేస్తే.. మోడీకి వ‌చ్చే మైలేజీ కంటే కూడా బుల్లెట్ ట్రైన్ ను భార‌త్‌కు తెచ్చినందుకు వ‌చ్చే మైలేజీ భారీగా ఉంటుంది. అందుకే ఆయ‌న బుల్లెట్ ట్రైన్ మీద‌న ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేయ‌ట‌మే కాదు.. దాన్ని సాకారం చేసే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. బాగా ఆక‌లితో ఉన్న వారికి త‌క్ష‌ణం అన్నం పెట్టాల్సింది పోయి.. కాస్త ఆగండి బిర్యానీ వండిస్తున్నా.. అన్న రీతిలో మోడీ తీరు ఉంద‌ని చెప్పాలి. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కంటే కూడా త‌న ఇమేజ్‌.. త‌న స‌ర్కారు మ‌రింత బ‌ల‌ప‌డేలా.. త‌న పార్టీకి భారీ ప్ర‌యోజ‌నం చేకూరే అంశాల మీదా.. ప్రాజెక్టుల మీద‌నే మోడీ దృష్టి అంతా అని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News