మీడియాపై మోడీ మేనేజ్ మెంట్ తెలిస్తే అవాక్కే!

Update: 2018-08-13 05:40 GMT
పాల‌కుడు ఎంత మంచోడు?.. మ‌రెంత స‌మ‌ర్థ‌వంతుడు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు అడిగితే ఎవ‌రికి వారు త‌మ అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తారు. అయితే.. ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల్ని ప్ర‌జాస్వామ్య భార‌తం కోణంలో స‌మాధానాలు ఇవ్వాల‌న‌ప్పుడు కూడా త‌మ అభిప్రాయంలో పెద్ద‌గా మార్పు లేకుండానే చెప్పేస్తారు. ఇప్పుడొచ్చిన ఇబ్బంది అదే. దేశ ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న‌ స్వేచ్ఛ‌.. భావ వ్య‌క్తీక‌ర‌ణ‌ల‌పై కొంద‌రు చేస్తున్న ప్ర‌యోగాలు రానున్న రోజుల్లో ఎంత తీవ్రం కానున్నాయ‌న్న విష‌యాన్ని తాజా ఉదంతం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి.

యూపీఏ స‌ర్కారుకు సంబంధించిన కుంభ‌కోణాలు.. పాల‌నా వైఫ‌ల్యాల గురించి వ‌చ్చే వార్త‌లు.. మోడీ హ‌యాంలో ఎందుకు రావ‌టం లేదు?  మీడియాలో వార్త‌లు రావ‌టం లేదు కాబ‌ట్టి.. దేశంలో అవినీతి అన్న‌ది లేద‌న్న‌ట్లేనా?  పాల‌నపై నెగిటివ్ వార్త‌లు రావ‌టం లేదంటే.. మోడీ పాల‌న అద్భుతంగా సాగుతున్న‌ట్లా?  లోక‌మంతా ప‌చ్చ‌గా ఉన్న‌ట్లుగా.. ఎక్క‌డా ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుంటే రాఫెల్ ముచ్చ‌ట ఏంది?

స‌గ‌టు జీవి త‌న‌కు తాను ఏదైనా ప‌ని కోసం ప్ర‌భుత్వ ఆఫీసుల‌కు వెళితే.. చేతులు త‌డ‌ప‌కుండానే ప‌నులు పూర్తి అవుతున్నాయా?  అన్న ప్ర‌శ్న వేసుకుంటే.. దేశంలో అవినీతి ఎంత‌లా ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మవుతుంది. ప‌రిస్థితుల్లో గ‌తానికి వ‌ర్త‌మానానికి ఏ మాత్రం వ్య‌త్యాసం లేన‌ప్పుడు.. ఇక మోడీ స‌ర్కారు నీతిగా పాలిస్తుంద‌న‌టం స‌రైన‌దేనా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్న‌ట్లు? అంటే.. కార‌ణం లేక‌పోలేదు. త‌మ‌కు సంబంధించిన నెగిటివ్ వార్త‌ల‌పై గుట్టుచ‌ప్పుడు కాకుండా మోడీ అండ్ కో చేస్తున్న మేనేజ్ మెంట్ కు సంబంధించిన వివ‌రాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మోడీ హ‌యాంలో సాగుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై త‌మ‌కు ముందుగానే ట్రైనింగ్ ఇస్తార‌ని.. అధికారులు చెప్పిన‌ట్లే తాము మాట్లాడిన‌ట్లుగా కొంద‌రు గ్రామీణ మ‌హిళ‌లు చెప్ప‌టం.. దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని ఏబీపీ (ఆనంద్ బ‌జార్ ప‌త్రిక‌కు చెందిన‌) ఛాన‌ల్ లో ప్ర‌సారం కావ‌టం.. దీనికి బ‌దులుగా ఆ చాన‌ల్ ఎడిట‌ర్ తో పాటు యాంక‌ర్ త‌మ ఉద్యోగాల‌కు రాజీనామాలు చేయ‌టం (?) తెలిసిందే. దీని వెనుక మేనేజ్ మెంట్ మీద వ‌చ్చిన ఒత్తిడే కార‌ణ‌మ‌న్న వార్త‌లు జోరుగా వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే.. స‌ద‌రు ఎడిట‌ర్ గారు ఒక వ్యాసం రాశారు. అదిప్పుడు వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. మోడీ స‌ర్కారు మీడియా మేనేజ్ మెంట్ తీరు సంచ‌ల‌నంగా మారింది. మీడియాలో వ‌చ్చే వార్త‌ల మీద మోడీ అండ్ కో నిరంత‌రం జ‌రిపే  క‌స‌ర‌త్తు వింటే.. అవాక్కు అవ్వాల్సిందే. దీనికి సంబంధించి ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో వ‌చ్చిన వార్త‌లోని కొన్ని అంశాలు తీసుకుంటే..

+ అన్ని వార్తా చానళ్లు - పత్రికలపై మోదీ సర్కారు 24 గంటలూ.. ప్రతి క్షణం నిఘా పెడుతోంది. సూచనాభవన్‌ లో ఇందుకోసం ఏకంగా వార్‌ రూమే ఏర్పాటుచేసింది. 200 మంది జర్నలిస్టులతో ఈ పర్యవేక్షణ సాగిస్తోంది. ఏ చానల్‌ వైఖరి ఎలా ఉంది.. ఏం వార్తలు ప్రసారం చేస్తోంది.. అందులో మోదీ వ్యతిరేకత - అనుకూలత ఎంత? ఏ జర్నలిస్టు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు... ఎవరు అనుకూలంగా అస్మదీయుల జాబితాలో ఉన్నారు.. పత్రికల్లో మోదీకి ఎంత కవరేజీ ఇస్తున్నారు.. నెగటివ్‌ గా రాస్తున్నారా.. రాసేవారెవరు.. ఇలాంటి వివరాలన్నీ తమ బాస్‌ లకు తెలియజేయడమే వీరి పని. వీరిలో ఐఐటీ - ఐఐఎంలలో చదివినవారు కూడా ఉండడం విశేషం.

+ తక్కువ కవరేజీ ఇస్తున్నవారికి ఈ పర్యవేక్షక బృందం నుంచి తక్షణమే ఫోన్‌ వెళ్తుంది.. హెచ్చరికలతో కూడిన సలహాలు ఉంటాయి. అదే సమయంలో ఆ మీడియా యజమానికి నివేదిక కూడా అందుతుంది.. ఆయన వెంటనే ఎడిటర్‌ పై మండిపడతారు. చానళ్లు - పత్రికలపై పర్యవేక్షణ బీజేపీ పాత ప్రధాన కార్యాలయం నుంచి కూడా జరుగుతుండడం ఇంకో ఆందోళనకర అంశం. ఢిల్లీ అశోకా రోడ్‌ లోని ఈ కార్యాలయంలో మరో 250 మంది వరకు పనిచేస్తున్నారు. వీరి పని కూడా రోజూ బీజేపీ అనుకూల - ప్రతికూల చానళ్లు - పత్రికలు - జర్నలిస్టులను గుర్తించడం.. తమ పైవారి దృష్టికి తీసుకెళ్లడం.. అక్కడి నుంచి సూచనలు జారీ కావడం.. దాదాపుగా ఇది నిత్యకృత్యంగా మారింది.

+  ఇదెలా ఉంటుంద‌న్న ఉదాహరణలోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సభలకు జనం ఎలా హాజరయ్యారు..ఆయన ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది.. తదితర వివరాలు అడుగుతూనే.. సోషల్‌ మీడియాలో బీజేపీ అనుకూల కథనాలు వండివార్చడం వీరి పని.

+ ఇలాంటి వారికి  ఒక ఎక్సెల్‌ షీట్‌ ఇస్తారు. దానిపై బీజేపీ అనుకూల చానళ్లు ఏవి.. ప్రతికూలమెవరో నమోదు చేయాలి. టీవీ చర్చల్లో ఏ పార్టీ ప్రతినిధి బాగా మాట్లాడారో గుర్తించాలి. ఉదాహరణకు ఓ చానల్‌ ఉన్మాద మూక హత్యల గురించి ప్రైమ్‌ టైంలో ప్రసారం చేస్తోందనుకోండి. బీజేపీకి వ్యతిరేకంగా సదరు చానల్‌ వ్యవహరిస్తోందన్న మాట. ఎక్సెల్‌ షీట్‌ లో   అదే విష‌యాన్ని నమోదు చేస్తారు.
 
+ ఒకవేళ వార్‌ రూంల నుంచి వచ్చే సూచనలను ఒకవేళ ఎవరైనా పట్టించుకోకపోతే సదరు చానల్‌/పత్రిక ఎడిటర్‌ కు ‘స్నేహపూర్వక’ హెచ్చరిక జారీ అవుతుంది. ‘పరిస్థితి తీవ్రత మీకు తెలియడం లేదు. మీరు సంపాదకుడు.. వార్తను నిర్ణయించాల్సింది మీరే. కానీ దేశానికి ఏది అవసరమో కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేశ ప్రయోజనాలు మీకు పట్టడం లేదు. కాలం మారుతోందని మీరు గ్రహించాలి. పాతకాలపు ఆలోచనలకు కాలం చెల్లుతోంది. మీరు తెలివిగలవారు. మంచిచెడులు ఆలోచించే సామర్థ్యం మీకు ఉంది. మా పట్ల సానుకూలంగా ఉండండి’ అని ఫోన్లో సుతిమెత్తగా హెచ్చరిస్తారు. మాట వినని చానళ్లను బ్లాక్‌ లిస్ట్ లో పెట్టేస్తారు.
 
+ ప్రభుత్వంతో అనవసరంగా పెట్టుకోవడం ఎందుకనుకునే యజమానులు.. ఇప్పుడు తామే ఎడిటర్లుగా వ్యవహరిస్తూ.. అపార అనుభవం ఉన్న ఎడిటర్లను ట్రైనీలుగా చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన జీతం పుచ్చుకుని ఎడిటర్లు మౌనంగానైనా ఉండాలి.. ప్రస్తుత ‘నిఘా’కు తగినట్లుగా తమను తాము మలచుకుంటే సరేసరి. లేదంటే ఉద్వాసన ఖాయం. నిజానికి, తొలుత మోదీ కవరేజీ గురించే నివేదిక ఇచ్చేవారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా - మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ గురించి కూడా నివేదికలు ఇస్తున్నారు.
 
+ సూచనాభవన్‌ లో గతంలో పర్యవేక్షణకు 15-20 మంది ఉండేవారు. దానిని 200కి పెంచారు. వీరిని ఆరు నెలల కాంట్రాక్టుపై తీసుకుంటున్నారు. అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వీళ్లు రోజుకు 12 గంటలు పని చేస్తున్నారు. వారంలో ఒక రోజు సెలవు. అత్యవసరమైతే ఆ రోజు కూడా పని చేయాల్సి ఉంటుంది. మొదటి నాలుగు గంటలూ వీళ్లు తమకు అప్పజెప్పిన రాష్ట్రాలకు చెందిన పత్రికలను చదువుతారు. తర్వాతి నాలుగు గంటలు నిర్దేశిత టీవీ చానళ్లను చూస్తారు. చివరి నాలుగు గంటల్లో జర్నలిస్టుల ట్విటర్‌ - ఫేస్‌ బుక్‌ - వాట్సాప్ లను పరిశీలిస్తారు.
 
+ ఈ మధ్యలోనే తాము పర్యవేక్షించిన అంశాలపై నివేదికలు కూడా ఇస్తారు. వాటి ఆధారంగా వారి సీనియర్లు రంగంలోకి దిగుతారన్న మాట. పర్యవేక్షక విభాగంలో పనిచేస్తున్న ఆయుష్‌ అనే హరియాణా యువకుడి వద్ద వందల మంది జర్నలిస్టుల జాబితా ఉంది.

+ ఈ 200 మందిలో ఎవరూ నిఘా సమాచారం గురించి లీక్‌ చేయడానికి వీల్లేదు. ఎవరైనా చెబితే ఉద్వాసనే. ఇటీవల దీని వివరాలు కొంచెం బయటకు పొక్కడంతో ఈ సిబ్బందిపైనే ఇప్పుడు నిఘా పెట్టారు. ఆఫీసులోకి అడుగు పెట్టేటప్పుడు వారి వద్ద ఉన్న సెల్‌ ఫోన్లను బయట సెక్యూరిటీలో అప్పగించాలి. తిరిగి వెళ్లేటప్పుడే ఇస్తారు. లోపల పనిచేసేటపుడు అక్కడి పనిని ఎవరూ ఫొటోలు/వీడియో తీయరాదు. బయటి వ్యక్తులతో సంభాషించకూడదు. అన్నీ గుప్తంగా సాగాలి. ఏం జరుగుతోందో బాహ్య ప్రపంచానికి తెలియకూడదు.
Tags:    

Similar News