ఏపీకి ఎంతో చేశాం...ఇంకెంతో చేస్తాం

Update: 2019-03-01 17:04 GMT
`సత్యమేవ జయతే` పేరుతో విశాఖలోని రైల్వే మైదానంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ 40 సెకన్ల పాటు తెలుగులో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ మోడీ తెలుగులో చెప్పి ఆశ్చర్యపరిచారు. సభలో మోడీ మాట్లాడుతూ... ``విశాఖను చూస్తే మనసు పులకరిస్తుంది. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేశాం. ఆర్థిక - ఉపాధి వ్యవస్థలు రైల్వే జోన్ వల్ల బలోపేతం అవుతాయి. ప్రజల కోసం కాకుండా సంతానం కోసం ఆలోచించేవాళ్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు` అని పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ``ఏపీలో ఏరకమైన అభివృద్ధి జరగాలన్నా కేంద్రమే చేయాలి. ఏపీ అభివృద్ధికి - స్మార్ట్‌ సిటీగా విశాఖను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం. పాపాలు చేసినవాళ్లే భయపడతారు? నేను భయపడను..! నీతి - నిజాయితీగా పనిచేస్తే ఇక్కడ నేతలు భయపడాల్సిన అవసరం లేదు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కొందరు నన్ను తిడుతున్నారు. తెలుగు ప్రజల అస్థిత్వాన్ని దెబ్బకొట్టేందుకు అనైతిక రాజకీయాలు చేస్తున్నారు. కూటములు కడుతూ ఎలాంటి అజెండా లేకుండా జనం ముందుకొస్తున్నారు. కేవలం బీజేపీని దెబ్బ కొట్టేందుకు కూటములు కడుతున్నారు`అని విమర్శలు చేశారు.

ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇది అల్లూరి సీతారామరాజు తిరిగిన - నరసింహస్వామి వెలసిన ప్రాంతమన్నారు. విశాఖ ప్రజల చిరకాల వాంఛ.. విశాఖ రైల్వే జోన్ హామీని నెరవేర్చామని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయడంలో మరో ముందడుగు వేశామని తెలిపారు. ఇతర ప్రాంతాలకన్నా మెరుగైన రైల్వే సౌకర్యం ఏపీకి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే జోన్ తో అదనంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రైల్వే జోన్ తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక్కడున్న యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. యూ టర్న్ తీసుకునే నాయకులు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపరులే తనను గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ కూటమి కుటిలనీతి అర్థమైందన్నారు. ఎలాంటి ఎజెండా లేకుండా కూటమి కట్టారని విమర్శించారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను తప్పుపడుతుంటే.. మనదేశంలో ఉన్న కొందరు పాకిస్తాన్ ను సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంపై జీఎస్టీని తగ్గించామని తెలిపారు. విశాఖ స్మార్ట్ సిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.
Tags:    

Similar News