ఆ సీఎం భేషుగ్గా ఉన్నారు

Update: 2018-02-19 08:52 GMT
నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా.. అసామాన్యుడే అయినా సాదాసీదాగా వ్య‌వ‌హ‌రించ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని కీర్తించే గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ మీద ఒక పుకారు సంచ‌ల‌నంగా మారింది. ఈ రోజు ఉద‌యం వార్తా ఛాన‌ళ్లు కాసేపు గోవా సీఎం ఆరోగ్యంపై గోవా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఆరోగ్యం మీద ఒక్క‌సారిగా వెల్లువెత్తిన వదంతులు షాకింగ్ గా మారాయి. కాసేపు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఉన్న‌ట్లుండి గోవా ముఖ్య‌మంత్రి ఆరోగ్యం విష‌మంగా ఉంద‌న్న వార్త‌లు హ‌డావుడి చేశాయ‌న్న‌ది చూస్తే.. ప్ర‌ధాని మోడీ ఆసుప‌త్రికి వెళ్ల‌ట‌మే.

ఇంత‌కీ జ‌రిగిందేమంటే.. గోవా ముఖ్య‌మంత్రి అనారోగ్యంగా ఉండ‌టంతో ఆయ‌న ముంబ‌యిలోని లీలావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.  ఇదిలాఉంటే.. మాగ్నెటిక్ మ‌హారాష్ట్ర గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సుకు హాజ‌రైన మోడీ.. ప‌నిలో ప‌నిగా పారీక‌ర్ ను ప‌రామ‌ర్శించేందుకు ఆసుప‌త్రికి వెళ్లారు.

ప్ర‌ధానే స్వ‌యంగా ఆసుప‌త్రికి వెళ్లారంటే.. ఆయ‌న ఆరోగ్యం బాగోలేదా? అన్న అత్యుత్సాహ ఆలోచ‌న ఉన్న మీడియా సంస్థ‌ల పుణ్య‌మా అని బ్రేకింగ్స్ ప‌డిపోయాయి. ఈ వార్త‌ల జోరుతో వెంట‌నే స్పందించిన లీలావ‌తి ఆసుప‌త్రి యాజ‌మాన్యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ.. ముఖ్య‌మంత్రి ఆరోగ్యం బాగుంద‌ని.. మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల్లో నిజం లేద‌ని తేల్చింది. సీఎం భేషుగ్గా ఉన్నారు.. త్వ‌ర‌లోనే ఆయ‌న కోలుకొంటార‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. త‌మ సీఎం ఆరోగ్యం బాగుంద‌ని.. త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో పాల్గొంటారంటూ గోవా సీఎంవో ప్ర‌క‌టించింది. సో.. మ‌నోహ‌ర్ పారీక‌ర్ ఆరోగ్యంపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News