మా `సింహం` అంతే.. తేడా లేదు: బీజేపీ సంచ‌ల‌న కామెంట్లు

Update: 2022-07-13 16:54 GMT
దేశంలో నిర్మిస్తున్న కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నంపై జాతీయ చిహ్నం మూడు సింహాల‌ ఏర్పాటు విష‌యం దుమారం రేగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సార‌నాథ్‌లోని అశోక స్తంభంపై ఉన్న సింహాలు.. ఠీవీగా ఉండి రాజ‌సాన్ని ఒల‌క‌బోస్తున్నాయ‌ని.. కానీ, తాజాగా పార్ల‌మెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన సింహాలు.. హింస‌కు, ఉగ్రానికి ప్ర‌తిరూపంగా ఉన్నాయ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని మోడీ టార్గెట్‌గా.. ప్రతిప‌క్ష నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

సారనాథ్‌లోని అశోక స్తంభంతో తాజా నిర్మాణానికి చాలా తేడాలున్నాయంటూ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలవారు మండిపడ్డారు. ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు.

నూతన నిర్మాణంలో అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. సారనాథ్‌ స్తూపంలోని సింహాలు ఆకర్షణీయంగా, గంభీర వదనాన్ని కలిగి ఉండగా.. మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని మృగరాజులు రౌద్రంగా కోరలు చాచి క్రూరంగా కనిపిస్తున్నాయని వారు ఆక్షేపించారు.

అశోక స్తంభంలోని సింహాల రూపాలు, గుణగణాలను మార్చడమంటే జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. నూతన పార్లమెంటుపై నిర్మాణాన్ని చూస్తే.. 'సత్యమేవ జయతే' నుంచి 'సింహ మేవ జయతే'లా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయని తృణమూల్‌ నేత మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రం సంధించారు. 'గాంధీ నుంచి గాడ్సే వరకు' అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ వ్యవహారంపై ట్వీట్‌ చేశారు.

అయితే,దీనిపై బీజేపీ నాయ‌కులు స్పందించారు. ``మా సింహం మాఇష్టం`` అని వ్యాఖ్యానించారు. సారనాథ్‌ స్తూపం తరహాలోనే పార్లమెంటుపై జాతీయ చిహ్నం ఉందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్‌ బలూని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సారనాథ్‌ స్తూపం, ప్రస్తుత నిర్మాణం కొలతల్లో చాలా తేడా ఉందని.. అందుకే సింహాల రూపురేఖలు మారినట్లు కొందరికి అనిపిస్తుండొచ్చని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు.

ఒకవేళ సారనాథ్‌ చిహ్నం పరిమాణాన్ని పెంచినా, పార్లమెంటు భవనంపై ఏర్పాటుచేసిన చిహ్నాన్ని దాని స్థాయికి తగ్గించినా రెండింటిలో తేడా ఏమీ కనిపించదని స్పష్టం చేశారు. విగ్రహ రూపురేఖల్లో కొంత తేడాలున్నంత మాత్రాన జాతీయ చిహ్నాన్ని అవమానించినట్లు కాదని మరికొందరు  అభిప్రాయపడ్డారు. సారనాథ్‌లోని స్తూపంతో పోలిస్తే కొత్త విగ్రహం చాలా రెట్లు పెద్దదని గుర్తుచేశారు. అందువల్లే రూపురేఖల్లో మార్పులు కనిపిస్తుండొచ్చని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News