పవన్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం

Update: 2018-01-22 14:59 GMT
సినీ నటుడు - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ర్యాలీలో తొలిరోజే అప‌శృతి దొర్లింది. సాక్షాత్తు జాతీయ జెండాకు అవమానం జరిగింది. తెలంగాణ‌లో త‌న ప‌ర్య‌ట‌న ప్రారంభించిన కొండగట్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం 2 గంటలకు కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం పవన్.. రూ. 11 లక్షలు విరాళం ప్రకటించారు. కొండ‌గ‌ట్టులోని ఆంజనేయ‌స్వామి దేవాలయంలో పూజలు చేసిన పవన్.. బయటకు వస్తున్న క్రమంలో.. ఆయన అభిమానులు - కార్యకర్తలు జాతీయ జెండాలు ఊపారు. ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు.

అయితే ఇక్క‌డితోనే ఆగిపోలేదు. కొండ‌గ‌ట్టుపై దేవ‌స్థానం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం పవన్ క‌ళ్యాణ్ కారుపైకి చేరుకోగానే.. అత్యుత్సాహంతో అభిమానులు.. ఆయనపైకి జాతీయ జెండాలను విసిరేశారు. దీంతో పవన్ బౌన్సర్లు.. జాతీయ జెండాలను ఇష్టారాజ్యంగా నలిపి పక్కకు పడేశారు. ఇలా జాతీయ జెండాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్రలో జ‌రిగిన‌ అవ‌మానంపై మీడియాలో ప్ర‌ముఖంగా ప్ర‌సారం అయింది.

కాగా, అనంత‌రం క‌రీంనగ‌ర్‌ లో ప‌వ‌న్ క‌ల్యాన్‌ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ తాను సంపూర్ణ రాజకీయ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలనుకున్నానని తెలిపారు. అందుకోసమే కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నాన‌ని వివ‌రించారు. ఆంజనేయస్వామిని నమ్మితే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయనే నమ్మకం త‌న‌కు ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి ఈ నెల 27 న ప్రారంభమవుతుందని - ఒంగోలులో ఫ్లోరోసిస్ - కిడ్నీ బాధితులను కలుస్తామ‌ని ప‌వ‌న్ తెలిపారు. విశాఖ‌ ఏజెన్సీ ప్రాంతంలోనూ త‌మ పర్యటన ఉంటుందని - కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వెళ్తామ‌ని ప‌వ‌న్ వివ‌రించారు.
Tags:    

Similar News