కేసీఆర్ జాతీయ పార్టీ ప్రచారానికి టీవీ చానళ్లు?

Update: 2022-10-03 12:32 GMT
యుద్ధంలోకి దిగాక కత్తి వెతుక్కునే బదులు.. ముందే సరంజామా సర్దుకుంటే పోరాడవచ్చని కేసీఆర్ యోచిస్తున్నారు. అందుకే జాతీయ రాజకీయాల్లోకి రంగ ప్రవేశానికి ముందే సీఎం కేసీఆర్ అన్ని ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు.  ప్రజల్లోకి పార్టీ వెళ్లాలంటే ప్రధాన సాధనం మీడియానే. అందుకే కొత్తగా రెండు టీవీ చానళ్ల ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

జాతీయ భాష హిందీతోపాటు ఇంగ్లీష్ భాషల్లో ఢిల్లీ కేంద్రంగా ఈ చానెళ్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేసీఆర్ దసరా సందర్భంగా అక్టోబర్ 5న జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు. అదేరోజున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. జాతీయ పార్టీగా మార్పుపై టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది.

డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండా వంటి అంశాలపై ఇవాళ జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విజయదశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు, బాణాసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇక మీడియా సపోర్టు అవసరం కావడంతో జాతీయ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ రెండు చానెళ్ల ఏర్పాటుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News