సిద్ధూ రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఫుల్ స్టాప్

Update: 2019-07-20 10:54 GMT
కాంగ్రెస్ ఆధిపత్య పోరులో మరో పెద్ద వికెట్ పడింది.  బీజేపీతో ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ పెత్తందారీ పోకడలు నచ్చక కాంగ్రెస్ లో చేరారు క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పటికే కాంగ్రెస్ ను లీడ్ చేస్తున్న అమరేందర్ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. సిద్ధూకు కొన్ని కీలక శాఖలకు మంత్రిగా అవకాశం ఇచ్చారు.

నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు సమీకాలికుడైన సిద్ధూనే పంజాబ్ సీఎంను చేయాలని రాహుల్ పట్టుబట్టాడు. కానీ కాంగ్రెస్ లోని సీనియర్ల త్రయం మాత్రం అమరీందర్ ను చేసింది. సిద్ధూను చేసి పంజాబ్ లో కాంగ్రెస్ ను బలంగా నిలబెట్టాలనుకున్న రాహుల్ ఆశలపై నీళ్లు చల్లారు.

ఇక తనకు పోటీగా ఉన్న సిద్ధూను ముఖ్యమంత్రి అమరీందర్ ఆది నుంచి వివక్ష పూరితంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. పాకిస్తాన్ కు వెళ్లి పాక్ ప్రధానిని పొగడడం వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. నెల రోజుల క్రితం సిద్ధూ చేపట్టిన పంచాయతీరాజ్, సాంస్కృతిక శాఖల బాధ్యతలను తొలగించి నామమాత్రమైన శాఖలను సీఎం అమరీందర్ సింగ్ ఇచ్చాడు. ఇదే ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది.

ఈ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశాడు సిద్ధూ. అయినా ఫలితం లేకపోవడంతో  మనస్తాపంతో నెలరోజుల కిందటే  మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి   సీఎం అమరీందర్ కు పంపారు.

సిద్దూ ఆ మధ్య పాకిస్తాన్ వెళ్లి పాక్ ప్రధానిని పొగడడమే వివాదానికి కారణమైంది. అప్పటి నుంచే అమరీందర్ సిద్ధూను దూరం పెడుతున్నాడు. ఇప్పుడు రాజీనామా గవర్నర్ కు పంపి ఆమోదింపజేసి సిద్దూను ఇంటికి పంపించాడు.

సిద్దూ రాజకీయాల్లోకి రాకముందు క్రికెట్ వ్యాఖ్యాతగా.. పలు టీవీ షోలకు యాంకర్ గా పనిచేశారు. హాస్యాన్ని పండించి పాపులర్ అయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అదే దూకుడుతో ఇమడలేక వైదొలిగారు.

    

Tags:    

Similar News