మావోయిస్టుల రాజ్యానికి నక్సలైట్ల భయం!

Update: 2015-04-14 14:30 GMT
తమది మావోయిస్టుల ఎజెండా అని టీఆర్‌ఎస్‌ అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదే పదే ప్రకటించారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన ఆ ప్రకటన చేశారు. ఇక తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టులు కూడా మద్దతు తెలిపారు. దాంతో, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో మావోయిస్టులు ఉండరని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం ఉండదని అంతా భావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం.

తమది మావోయిస్టుల ఎజెండా అని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఇప్పుడు అసాధారణ భద్రత కల్పించాల్సిన దుస్థితి. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతోపాటు కొత్తగా మందుపాతర్లను కూడా తట్టుకుని నిలిచే రక్షణ కవచాలను కూడా ఏర్పాటు చేశారు. అందులో ఆధునిక ఆయుధాలతో ఆరుగురు కమెండోలు ఉంటారట. అవసరమైతే తప్ప రోడ్డు మార్గంలో ప్రయాణించవద్దని, పూర్తిగా హెలికాప్టర్లలోనే ప్రయాణించాలని కూడా నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి సూచించాయట. తెలంగాణలో మావోయిస్టులు చాప కింద నీరులా విస్తరిస్తున్నారని, తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారని కూడా నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని అత్యంత ప్రముఖులపై దాడి చేసే స్థాయిలో బలం పెంచుకుంటున్నారని కూడా నిఘా వర్గాలు వివరిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అప్పట్లో పోలీసులు, నిఘా వర్గాలు, కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించాయి. అయినా, మావోయిస్టులు తమకు మిత్రులని, తమది మావోయిస్టుల ఎజెండా అని, తమకు మావోయిస్టులతో ముప్పే ఉండదని కేసీఆర్‌ తదితరులు వ్యాఖ్యానించారు. మరి, తెలంగాణ వచ్చిన ఎనిమిది నెలల్లోనే కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధారణంగా భద్రతను ఎందుకు పెంచుకుంటున్నారు. కేవలం హెలికాప్టర్లలోనే తిరగాలని ఎందుకు భావిస్తున్నారు? తన చుట్టూ రక్షణ కవచాలను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు!? తెలంగాణలో మావోయిస్టులు విస్తరిస్తే మాత్రం తప్పేముంది? వారంతా ప్రభుత్వానికి మిత్రులు అయినప్పుడు.. ప్రభుత్వానిది మావోయిస్టు ఎజెండా అయినప్పుడు మావోయిస్టులు ప్రాబల్యం పెంచుకున్నా పోయేదేముంది? అనే ప్రశ్నలను ఇప్పుడు మేధావులు సంధిస్తున్నారు.

Tags:    

Similar News