ఎన్డీటీవీ చెబుతున్న బిహార్ కింగ్ ఎవరు?

Update: 2015-11-07 04:04 GMT
మరో 24 గంటలంతే. ఐదు దశల్లో బిహార్ ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన తీర్పు బయటకు రానుంది. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. బిహార్ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్  వెల్లడించిన ఏడు మీడియా సంస్థలు పోలింగ్ ముగిసిన వెంటనే తమ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి. ఇందులో రెండు సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు బిహార్ ప్రజలు పట్టం కడతారని తేల్చగా.. మిగిలిన సంస్థలు మాత్రం జనతాదళ్ నేతృత్వంలోని లౌకిక మహాకూటమిదే విజయమని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. ప్రముఖ మీడియా సంస్థ అయిన ఎన్డీటీవీ ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినా గురువారం ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయలేదు. శుక్రవారం రాత్రి ఎన్డీటీవీ తన ఎగ్జిట్ పోల్స్ వివరాల్ని వెల్లడించింది.  మిగిలిన మీడియా సంస్థలకు భిన్నంగా తాను చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి వివరణలు.. విశ్లేషణలు ఇచ్చింది.

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే పట్ల మొగ్గు ప్రదర్శించింది. మొత్తంగా బిహార్ కింగ్ ఎన్డీయే అని తేల్చిన ఎన్డీటీవీ ఆ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు 125 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. మొత్తం పోలైన ఓట్లలో 43 శాతం ఓట్లు ఎన్డీయేకు పడ్డాయని అంచనా వేసింది. అయితే.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు 56.28 శాతం ఓట్లు పోల్ కావటం గమనార్హం.

ఇక.. మిగిలిన పార్టీల విషయానికి వస్తే.. లౌకిక మహాకూటమికి 41 శాతం ఓట్లతో 110 సీట్లు దక్కనున్నాయని తేల్చారు. ఇతరులకు 16 శాతం ఓట్లతో 8 అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకుంటారని తేల్చారు.

మొత్తం ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో దశల వారీగా చూస్తే.. మొదటి.. ఐదో దశ ఎన్డీయేకు ప్రతికూలంగా.. మిగిలిన రెండు.. మూడు.. నాలుగు దశలు మాత్రం ఆ కూటమికి అనుకూలంగా పోలింగ్ జరిగినట్లు తేల్చారు. మహిళలు ఎన్డీయే పక్షం వైపు మొగ్గు చూపారని.. పట్టణ ప్రాంత ఓటర్లతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సైతం బీజేపీ పట్ల తమ అభిమానాన్ని ప్రదర్శించినట్లుగా ఎగ్జిట్ పోల్స్ లో వినిపిస్తున్న మాట.

ఇక.. దశల వారీగా రెండు ప్రధాన పక్షాలకు వచ్చే సీట్లపై ఎన్డీటీవీ అంచనా చూస్తే..

మొదటి దశ; 49 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఈ దశలో మహాకూటమికి 28 సీట్లు.. ఎన్డీయేకు 20 సీట్లు సొంతం చేసుకోనున్నాయి.

రెండో దశ; 32 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో  మహాకూటమికి 12 సీట్లు.. ఎన్డీయేకు 19 స్థానాలు రానున్నాయి.

మూడో దశ; 50 అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమికి 21 సీట్లు.. ఎన్డీయేకు 28 స్థానాలు రానున్నాయి.

నాలుగో దశ; 55 స్థానాలున్న ఈ దశలో మహాకూటమికి 21 స్థానాల్లో.. ఎన్డీయే 31 స్థానాల్లో విజయం సాధించనుంది.

ఐదో దశ;   57 స్థానాల్లో జరిగిన ఈ దశలో మహాకూటమికి 28 సీట్లు.. ఎన్డీయేకు 27 సీట్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
Tags:    

Similar News