ఇంధనం కావాలి : మూడు పార్టీలలో అదే చర్చ...?

Update: 2022-07-20 13:56 GMT
ఎన్నికలు అంటే సామాన్య విషయం కాదు, గెలుపు అవకాశాలు ఉన్నా కూడా ఇంధనం కూడా తోడు కావాలి. ఏపీలో రాజకీయం చూస్తే పాతికేళ్ళ నుంచి ధనం ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు అన్నది పక్కన పెడితే ఎన్ని నీతులు చెప్పినా కూడా ఎవరి మటుకు వారు దాన్ని వాడేసుకుంటున్నారు. 2019 ఎన్నికలు ఏపీలో అత్యంత ఖరీదైనవిగా ఇప్పటిదాకా చెప్పుకున్నారు కానీ ఇపుడు 2024 ఎన్నికలు దానికి మించి కాస్ట్ లీ  అని కూడా అంటున్నారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఇంధనం విషయంలో పెద్దగా సమస్యలు ఉండవని అంటున్నారు. 2019 ఎన్నికల దాకా అధికారం రుచి చూడకుండానే వైసీపీ దూకుడు చేసింది. ఏ ఎన్నిక జరిగినా జబర్దస్తుగానే ఖర్చు పెట్టిందని చెబుతారు. మరి నాడే అంతలా విచ్చలవిడిగా ఉన్న వైసీపీ చేతిలో ఇపుడు అధికారం ఉంది. దాంతో వైసీపీకి పట్టపగ్గాలు ఉండవని అంటున్నారు. దానికి తోడు అధికార పార్టీకి ఉండే అన్ని రకాలైన అడ్వాంటేజెస్ కూడా కలసివస్తాయని అంటున్నారు.

తెలుగుదేశం విషయానికి వస్తే 2019 దాకా ఆర్ధిక వనరులకు ఢోకా లేకుండా పోయింది అని అంటున్నారు. చంద్రబాబుకు కుడి ఎడమలుగా ఇద్దరు బడా నేతలు ఎపుడూ ఉండేవారు. వారు చాలా వరకూ ఆర్ధిక ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు. అలాగే చాలా మంది బిగ్ షాట్స్ కూడా పార్టీకి టచ్ లో ఉండేవారు. అయితే మూడేళ్ళుగా సీన్ మారింది. చాలా మంది టీడీపీ సానుభూతిపరుల మీద టార్గెట్ పెట్టి మరీ కూశాలు కదిలించే కార్యక్రమానికి వైసీపీ తెరతీసింది.

దాంతో చాలా మంది వ్యాపారాలు కూడా ఇబ్బందులో పడ్డాయని అంటున్నారు. అయినా సరే టీడీపీ పవర్ లోకి రావాలన్న కసి బలమైన సామాజికవర్గంలో ఉంది. వారే ఒంగోలులో మహానాడుని దగ్గరుండి మరీ విజయవంతం చేశారని అంటున్నారు. ఇక ఎన్నారైలు కూడా ఈసారి టీడీపీ రావాలని బలంగా కోరుకుంటున్నారు. దాంతో ఏ మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నా టీడీపీ మీద పందెం కాసే వారి జాబితా కొండవీటి చాంతాడుగా ఉంది.

అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా ఈసారి సహకరిస్తేనే టీడీపీకి ఇంధన వనరులు భారీగా సమకూరుతాయని అంటున్నారు. ఈడీ,  ఇన్ కమ్ టాక్స్ వంటివి ప్రయోగించకుండా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడం అందులో భాగమే  అని అంటున్నారు. ఏది ఏమైనా ఢక్కామెక్కీలు తిన్న పార్టీ కాబట్టి టీడీపీ ఇంధన వనరులు అన్నవి పెద్ద సమస్య కాబోదనే అంచనా కడుతున్నారు.

ఇక రేసులో ఉన్న మూడవ పార్టీ జనసేన. సొంతంగా బరిలో ఉన్నా లేక పొత్తులలో ఉన్నా కూడా ఈసారి ఇంధన వనరులు చాలానే చూసుకోవాలని అంటున్నారు. జనసేనకు బలమైన సామాజికవర్గం దన్ను ఉంది. అయితే ఇంధనవనరులు ఎంతమేర సమకూరుతాయన్నది కూడా ఆలోచించాలి. అయితే ఈసారి జనసేన వైపు కొమ్ము కాసిన వారు, ఆయా వర్గాలు తామున్నామని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

అదే విధంగా ఏపీ నుంచి గెలిచి ప్రభుత్వం మీద తిరుగుబావుటా ఎగరవేసిన ఒక ఎంపీ కూడా ఇంధనవనరులను సమకూర్చడానికి జనసేనకు అభయహస్తం ఇచ్చారని ప్రచారం సాగుతోంది.  జీరో బడ్జెట్ అని గత ఎన్నికల్లో దిగిన జనసేనేకు వాస్తవాలు బోధపడ్డాయని కనీసమాత్రంగా అయినా ఖర్చు చేయలసిన చోట చేయకపోతే గెలుపు అవకాశాలు దక్కవని ఆలోచనతో ఇంధనవనరుల విషయంలో ఇప్పటి నుంచే అన్వేషణ చేస్తోంది అంటున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలు అన్నీ ఇంధన వనరుల వేటలో ఉన్నాయి అని చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News