రెడ్ శాండిల్ క్వీన్ వెక్కివెక్కి ఏడ్చేసింది

Update: 2016-07-06 09:04 GMT
ఏపీ పోలీసులు.. మరీ ముఖ్యంగా చిత్తూరు పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్ గా పేరొందిన మోడల్.. సినీనటి నీతూ అగర్వాల్ కు చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. శేషాచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇష్యూలో ఆమె పాత్రకు సంబంధించిన ఆధారాల్ని సేకరించిన చిత్తూరు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసిన అదుపులోకి తీసుకునేందుకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు వెళ్లారు.

తొలుత ఆమెను అదుపులోకి తీసుకున్న వెంటనే.. డజన్ కు పైగా లాయర్లు ఈ రెడ్ శాండిల్ క్వీన్ కు రక్షగా నిలిచి గంటల వ్యవధిలో ఆమెకు బెయిల్ వచ్చేలా చేశారు. అప్పటి నుంచి ఆమెను అదుపులోకి తీసుకొని చిత్తూరు తరలించాలని పోలీసులు కిందామీదా పడుతున్నా.. ఆమెను మాత్రం తీసుకురాలేని పరిస్థితి. కోర్టు అనుమతించకపోవటం లాంటి కారణాలతో ఆమె ఏపీ పోలీసులకు ‘సినిమా’ చూపిస్తున్నారంటూ ఏపీ అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. నీతూ తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను అమాయకురాలినని.. తనను అనవసరంగా ఈ కేసుల్లో ఇరికించారని వాపోయారు. చేతులు జోడించి.. మాటకు ముందు ఒక ‘భయ్యా’.. మాటకు చివర ఒక ‘భయ్యా’ అంటూ దీనంగా వేడుకుంటూ తమను వదిలేయాలని.. తమ బతుకు తమను బతకనివ్వాలంటూ వేడుకుంటున్న వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తనపై అన్యాయంగా కేసులు పెట్టటమే కాదు.. పోలీసులు తన బంధువులను కూడా విడిచి పెట్టటం లేదని.. రాఖీ కట్టిన పాపానికి వారిని తీవ్రంగా వేధిస్తున్నారని.. వారి కుటుంబ సభ్యులు దీనంగా రోదిస్తున్నారని.. దయచేసి వారిని వదిలిపెట్టాలన్నారు. పెద్దగా అండ లేని కుటుంబం నుంచి వచ్చిన తాను నమ్మి పెళ్లి చేసుకున్న దానికి.. పోలసులు తనపై కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని.. తమను విడిచిపెట్టాలని.. తమపై తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని ఆమె వేడుకున్నారు.

తమ బ్రదర్స్ (సొంతం కాదు)ను ఏపీ పోలీసులు జైల్లో పెట్టారని.. వారిలో ఒకరు కడప జైల్లో ఉన్నారని.. మరో ఇద్దరు పొద్దుటూరు జైల్లో ఉన్నారన్నారు. వారి పేర్లను నరేశ్ చౌదరి.. రతన్ చౌదరి.. కైలాశ్ చౌదరిగా పేర్కొన్నారు. వారిలో ఒక బ్రదర్ ది పెళ్లి ఖాయమైందని.. దయచేసి వారిని వదిలిపెట్టాలంటూ వేడుకుంటున్న తీరు చూస్తే.. ఈమెనేనా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ క్వీన్ అనేది అన్న సందేహం కలగక మానదు.
Tags:    

Similar News