‘మా’ ఎన్నికలపై మంత్రి పేర్ని నాని సంచలన ప్రకటన

Update: 2021-10-04 16:30 GMT
రోజురోజుకు ముదిరిపాకాన పడుతున్న 'మా' ఎన్నికలపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 'మా' ఎన్నికల్లో ప్రభుత్వ వైఖరిని తేల్చిచెప్పారు. ఆ ఎన్నికలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన సంచలన ప్రకటన చేశారు.ఏపీ ప్రభుత్వం కేంద్రంగా 'మా' ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.

'మా' అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు స్వయానా ఏపీ సీఎం జగన్ కు బావమరిది వరుస అవుతారు. జగన్ చిన్నాన్న కూతురును విష్ణు పెళ్లి చేసుకున్నాడు. అలాగే కేసీఆర్ తోనూ మంచి సంబంధాలున్నట్టు చెప్పడం వివాదానికి దారితీసింది.

ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ లను సినీ ఎన్నికల్లోకి లాగడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'ఎన్నికల్లోకి వైఎస్ జగన్, కేసీఆర్, బీజేపీలను లాగుతారా? వైఎస్ జగన్ మీ బంధువైతే 'మా' ఎన్నికలకు వస్తారా? రెండు సార్లు హలో చెబితే కేసీఆర్ ఫ్రెండ్ అయిపోతారా? ' అని గట్టిగా నిలదీశారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి పేర్ని నాని బయటకు వచ్చి 'మా' ఎన్నికలపై సవివరంగా ఒక ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. 'తెలుగు చిత్ర పరిశ్రమలో సాగుతున్న 'మా' ఎన్నికల్లో సీఎం జగన్ కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని' స్పష్టం చేశారు. ఈ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి, ఉత్సాహం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఏ వ్యక్తిని, వర్గాన్ని మేము సమర్థించడం లేదని.. తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని పేర్ని నాని స్పష్టం చేశారు.
Tags:    

Similar News