ప‌ద్మ‌శ్రీ అవార్డు...అంగ‌ట్లో స‌రుకు!

Update: 2017-12-24 06:00 GMT
ప‌ద్మ శ్రీ‌...దేశ అత్యున్న‌త పౌర‌ పుర‌స్కారాల్లో ఒక‌టి. వివిధ రంగాల్లో విశేష‌మైన సేవ‌, ప‌రిజ్ఞానం, ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్న వారికి భార‌త ప్ర‌భుత్వ బ‌హుక‌రించే అవార్డు. అయితే ఈ అవార్డు అమ్మ‌కానికి వ‌చ్చింది. అది కూడా త‌క్కువ ధ‌ర‌లోనే. కేవ‌లం రూ.4 కోట్ల‌కే! ఔనా? అదెలా?  కేంద్ర ప్ర‌భుత్వం అవార్డు అంగ‌ట్లో స‌రుకు అయిపోయిందా...ఎంత ఘోరం! అస‌లు ఎవ‌రు చేశారు ఈ ప‌ని? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చట్టాన్ని - న్యాయాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. డబ్బు కోసం మోసాలకు పాల్పడి పౌర పుర‌స్కారాన్ని ప‌లుచ‌న చేశాడు.

గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతానికి చెందిన కాకర్ల శేషారావ్‌ గుంటూరు సీసీిఎస్‌ పోలీసు స్టేషన్‌ లో సీిఐగా పని చేస్తున్నారు. తనకు రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉందని కొంత కాలంగా నెల్లూరు జిల్లా - తాను పని చేస్తున్న గుంటూరు జిల్లాలోనూ ప్ర‌చారం చేసుకున్నాడు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన రైతులకు ఇచ్చే పద్మశ్రీ అవార్డులను ఇప్పిస్తానని నమ్మబలికి కోట్లాది రూపాయ‌లు వసూలు చేశాడు. ఇలా నెల్లూరు - చిత్తూరు - గుంటూరు జిల్లాల్లో అమాయక ప్రజల నుంచి భారీ మొత్తంలో దండుకున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు ఇప్పిస్తానని ఓ రైతు నుంచి రూ.4 కోట్లు పైనే వసూలు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుంటూరు సీసీఎస్‌ లో పని చేస్తున్న సీిఐ కాకర్ల శేషారావ్‌ - ఆయన కుటుంబ సభ్యులను గూడూరు ఒకటో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

ఈ పోలీస్ మోస‌గాడి గురించి గూడూరు ఒకటో పోలీస్‌ స్టేషన్‌ లో సీిఐ సుబ్బారావు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కాక‌ర్ల శేషారావ్  అనేక మోసాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. అంతేకాకుండా సీఐ కాకర్ల శేషారావ్‌ అండతో పాల్వాయి ప్రసన్న లక్ష్మీ అలియాస్‌ గడ్డం ప్రసన్న లక్ష్మీ కుటుంబ సభ్యులు గూడూరుకు చెందిన ఆక్వా రైతు రాయపనేని రమణయ్య నాయుడును మోసం చేశారని తెలిపారు. నాలుగు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు లాగేశార‌ని వివ‌రించారు. ఇందులో భాగంగా తొలుత గుంటూరు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయిస్తామని బాధితుని వద్ద రూ.50 లక్షలు వసూలు చేశారన్నారు. కాగా, నిందితుడికి కోర్టు రిమాండ్‌ విధించింది. ఇదిలాఉండ‌గా...ఈ సంఘటనతో ఒక్కసారిగా పోలీసు శాఖలో కలకలం మొదలైంది.
Tags:    

Similar News