హ‌త్య కేసులో దోపిడీ దొంగ‌కు ఉరి శిక్ష!

Update: 2017-08-17 15:46 GMT
నెల్లూరు నాలుగో అదనపు సెషన్స్‌ కోర్టు గురువారం నాడు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. వరుస దోపిడీ - హత్యలకు పాల్పడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి  తీర్పు చెప్పారు. ఓ మహిళ హత్యకేసులో నేరం రుజువు కావడంతో   కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌ కు న్యాయమూర్తి బి. శ్రీనివాసరావు గురువారం ఈ మ‌ర‌ణ శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.2016లో దోపిడీ - హ‌త్యానేరం కింద అరెస్ట‌యిన నిందితుడికి ఏడాది త‌ర్వాత మ‌ర‌ణ శిక్ష‌ను ఖ‌రారు చేశారు.

ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూష‌న్ వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి..... నిందితుడు వెంకటేశ్వర్లు చదువు సరిగా రాకపోవడంతో హిందూపురంలో త‌న‌ అత్తగారి వద్ద ఉంటూ ఏడేళ్ల‌పాటు హోటల్లో పని నేర్చుకున్నాడు. ఆ స‌మ‌యంలో దురలవాట్లు - విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కావలిలో న్యూడిల్స్‌ వ్యాపారం చేస్తూ అప్పులపాలవ‌డంతో ఈజీ మ‌నీ కోసం దొంగతనాలకు - దోపిడీలకు పాల్పడేవాడు. ఇళ్ల‌లో ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకొని వారి నుంచి బంగారం - డబ్బు దోచుకునేవాడు. ఎవ‌ర‌న్నా ఎదురుతిరిగితే హత్య చేయ‌డానికి కూడా వెనుకాడేవాడు కాదు. 2016 జులై 9న నెల్లూరులోని  ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించి ఆయన భార్య ప్రభావతిని దారుణంగా హత్యచేశాడు.

ఆమె నగలను దోచుకెళ్లే ప్రయత్నిస్తుండ‌గా ఆమె కుమారుడు - కుమార్తె - భ‌ర్త అడ్డుకున్నారు. స్థానికులు నిందితుణ్ని బాలాజీనగర్‌ పోలీసులకు అప్పగించారు. అత‌డిపై పోలీసులు హ‌త్యానేరం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు గతంలో చేసిన మూడు దోపిడీ హత్య కేసులు కూడా బయటకు వచ్చాయి. అల్లీపురం గ్రామంలో వృద్ధ దంపతులను హత్యచేసి నగలు దోచుకున్న కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది. పద్మావతి హత్య కేసులో కూడా నేరం రుజువు కావడంతో ఇది అత్యంత హేయమైన చర్యగా న్యాయ‌మూర్తి భావించారు. దీంతో, నిందితుడికి  మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడిపై మరో రెండు కేసులు ప్రస్తుతం పెండింగ్‌ లో ఉన్నాయి.
Tags:    

Similar News