నెల్లూరు టీడీపీలో గంద‌ర‌గోళం.. పార్టీని కాపాడేదెవ‌రు..?

Update: 2019-12-26 09:40 GMT
రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప‌రిస్థితి జిల్లాకోర‌కంగా ఉంది. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ ప‌రిస్థితి అగ మ్య గోచ‌రంగా క‌నిపిస్తోంది. అధినేత చంద్ర‌బాబు నివాసం ఉండే గుంటూరులోనే పార్టీలో కుమ్ములాట‌లు.. అల‌క‌లు క‌నిపిస్తున్నాయి. ఇక‌, పార్టీకి బ‌ల‌మైన నాయ‌కులు చెల్లాచెదురైన‌.. నెల్లూరులో ప‌రిస్థితిని వేరే చెప్పాల్సిన ప‌నిలేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డి ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. కీల‌క‌మైన నాయ‌కు లు ఎన్నిక‌ల‌కు ముందు వెళ్లిపోయారు. వైసీపీ నుంచి ప‌నిగ‌ట్టుకుని తీసుకువ‌చ్చిన బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి వంటి వారు ఎన్నిక‌ల్లోనూ పార్టీకి ఉప‌యోగ‌ప‌డింది లేదు.. ఇప్పుడు ఏకంగా మ‌ళ్లీ వైసీపీవైపే చూస్తున్నారు.

ఇక‌, ఎప్ప‌ట్లాగే.. మ‌ళ్లీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ ఒక్క‌డే మీడియా ముందుకు వ‌స్తున్నాడు త‌ప్ప‌.. ఎవ‌రూ కూడా ప్రెస్‌ తో మాట్లాడేందుకు కూడా వెనుకాడుతున్నారు. బొల్లినేని కృష్ణ‌య్య వంటి సీనియ‌ర్‌ లు కూడా త‌మ సొంత వ్య‌వ‌హారాల్లో మునిగిపోయారు. వెంక‌ట‌గిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఇంటి నుంచి కాలు తీసి బ‌య‌ట పెట్ట‌డం లేదు. ఆయ‌న‌పై ఇప్ప‌టికే కేసులు ఉండ‌డంతో ఆయ‌న జంకుతున్నారు. ఇక‌, బీద సోద‌రుల్లో ఒక‌రు ఇప్ప‌టికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రొక‌రు బీజేపీవైపు చూస్తున్నార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

అదే స‌మ‌యంలో మాజీ మంత్రి నారాయ‌ణ త‌న విద్యా వ్యాపారానికి జ‌గ‌న్ ఎక్క‌డ గండి కొడ‌తాడోన‌ని బెదిరిపోతున్నార‌ని అంటున్నారు. ఇక‌, జిల్లా వ్యాప్తంగా ఒక్క‌రు కూడా యువ నాయ‌కులు లేక‌పోవ‌డం - బీసీ వ‌ర్గం మొత్తం కూడా వైసీపీకి మద్ద‌తు ప్ర‌క‌టించ‌డం వంటి ప‌రిణామాలు చూస్తే.. నెల్లూరులో టీడీపీ ఉంటుందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్‌రావు ఇప్ప‌టికే వైసీపీలోకి జంప్ చేయ‌డంతో బీసీల్లో బాగా మైన‌స్ అయ్యింది. అదే బాట‌లో మ‌రికొంద‌రు నాయ‌కులు కూడా ఉన్నారు. అస‌లు సూళ్లూరుపేట‌ - ఆత్మకూరు - నెల్లూరు రూర‌ల్ - ఉద‌య‌గిరి లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి స‌రైన అభ్య‌ర్థులే లేరు.

వైసీపీ త‌ర‌పున ఇటు నెల్లూరు సిటీ - రూర‌ల్‌ లో బ‌ల‌మైన నాయ‌కులు ఉండ‌డం ఆత్మ‌కూరు - స‌ర్వేప‌ల్లి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ పునాదులు బ‌లంగా ఉండ‌డం ప‌రిశీలిస్తే.. నెల్లూరులో చంద్ర‌బాబు చేప‌ట్టే వ్యూహం ఎలా ఉంటుంది? ఆయ‌న ఏవిధంగా జిల్లాలో పార్టీని న‌డిపిస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఈ జిల్లాపై దృష్టి పెట్టింది లేదు. పైగా పోయే వారిని పోనీ.. అనే వ్యాఖ్యానిస్తున్న‌ట్టు స‌మాచారం. సో.. ఇదీ నెల్లూరు టీడీపీ ప‌రిస్థితి..!
Tags:    

Similar News