ఆ జెండా కూడా పార్టీలాగే ఊడిప‌డింది!

Update: 2021-12-29 12:30 GMT
వందేళ్ల‌కు పైగా ఘ‌న చ‌రిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. కానీ ఇప్పుడా చ‌రిత్ర చూసి మురిసిపోవ‌డం త‌ప్ప భ‌విష్య‌త్‌లో తిరిగి పున‌ర్వైభవం సాధించేలా ఆ పార్టీ క‌నిపించ‌డం లేద‌న్న‌ది నిపుణుల మాట‌. కొన్నేళ్ల పాటు దేశంలో ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన ఆ పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు రోజురోజుకూ ద‌య‌నీయాంగా మారుతోంది. 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన‌ప్ప‌టి నుంచి ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వ‌స్తోంది. ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్క‌డ కూడా పార్టీ ప‌రిస్థితులు మెరుగ్గా ఏమీ లేవు.

సొంత పార్టీ నేత‌ల్లో అసంతృప్తి, పార్టీకి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు, అధిష్ఠానంపై విమ‌ర్శ‌లు, భ‌విష్య‌త్ బాగుండ‌ద‌నే సంకేతాలు.. ఇదీ ఇప్పుడు కాంగ్రెస్ దుస్థితి. పార్టీని న‌డిపించే స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం ఆ పార్టీకి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. సోనియా గాంధీ ప‌గ్గాలు వ‌దిలేసేందుకు ఎప్పుడో సిద్ధ‌మైపోయారు. కానీ ఆమెను బ‌ల‌వంతంగా అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగేలా చేస్తున్నారు. రాహుల్ గాంధీ మ‌రోసారి పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. కానీ అందుకు ఆయ‌న సంసిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆ పార్టీ జెండా కూడా ఊడిప‌డ‌డం కాంగ్రెస్ ప‌రిస్థితిని చాటుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ 137వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ఏఐసీసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండా ఆవిష్క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాన్ని ఆమె ఆవిష్క‌రిస్తున్న స‌మ‌యంలో ప‌తాకం ఒక్క‌సారిగా ఊడి ప‌డిపోయింది. అయితే వేగంగా స్పందించిన ఆమె దాన్ని కింద‌ప‌డిపోకుండా ప‌ట్టుకున్నారు. దీంతో ఈ సంఘ‌ట‌న‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితికి ముడిపెడుతూ నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. ప‌త‌న‌మ‌వుతున్న కాంగ్రెస్‌ను సోనియా ఇలాగే ప‌ట్టుకుని న‌డిపిస్తున్నార‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు.
Tags:    

Similar News