ఇంతకీ ఎవరికి షాక్ ఇచ్చారు సామీ.. ?

Update: 2021-12-19 14:39 GMT
మాటలు వేరు, చేతలు వేరు.  బరువైన బాధ్యతలు నెత్తిన పడ్డాక ఇచ్చిన మాట తేలిక అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాట   ను తూచ్ అని గట్టున పెట్టేస్తారు కూడా. అపుడు ఒట్టు వేశారు అని అన్నా ఏమీ లాభం లేదు. ఇవన్నీ రాజకీయాల్లో షరా మామూలే. ఇదిలా ఉంటే వైసీపీ అధినేతగా మాట తప్పను, మడమ తిప్పను అని గట్టిగా గర్జించిన జగన్ సీఎం అయ్యాక మాత్రం బాగానే మడమ తిప్పేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ మధ్యనే ఆయన   కొన్ని విషయాల్లో మడమ తిప్పేశారు అని ప్రత్యర్ధులు విమర్శలు సంధిస్తున్న వేళ ఆ జాబితాలో మరోటి కూడా చేరిపోయిందా అన్న చర్చ వస్తోంది.

వైసీపీ సిద్ధాంతం సంపూర్ణ మద్య పాన నిషేధం. ఏపీ పొలిమేరల్లో మద్యం లేకుండా చేస్తామని జగన్ పాదయాత్ర వేళ కాలికి బలపం కట్టుకుని మరీ ఊరూ వాడా చెప్పారు. ఇక దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని, తిరిగి 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తి నిషేధం ఉంటుందని నాడు చెప్పుకొచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బెల్ట్ షాపులను నియంత్రించారు కానీ మద్యం రేట్లను భారీగా పెంచేశారని విపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి.

ఇక చీప్ లిక్కర్ ని అంతటా తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కూడా విమర్సించారు. మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్లు పోగేసుకోవడానికే ఎక్కువ రేట్లు తెచ్చారని కూడా కామెంట్స్ చేశారు. ఇవన్నీ ఇలా ఉండగానే సడెన్ గా ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించేసింది. ప్రధాన బాండ్లను కూడా మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లుగా ప్రకటించింది. మద్యం ధరలు ఒక్కో బాటిల్ కి కనీసం రెండు వందల రూపాయల మేర తగ్గిస్తూ ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం విస్మయం కలిగించేలాగానే ఉంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఇప్పటిదాకా మద్యం అధిక ధరలకు అమ్ముతూ తాగుబోతులకు షాక్ కొట్టించే రేట్లు అని గొప్పగా చెప్పుకున్నవారు ఇపుడు మాత్రం ఏకంగా మద్య నిషేధానికే షాక్ కొట్టించేలా అమ్మకాలను పెంచుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారా అన్న డౌట్లను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. మద్యం అధికర ధరల మీద ఇప్పటిదాక ప్రభుత్వ  పెద్దలు చెప్పిన మాట ఒక్కటే. ధరలను చూసైనా వ్యసనం మానేస్తారు అని. అలాంటిది దాన్ని అందుబాటులోకి తేవడం అంటే మళ్ళీ వారిని మందుకు బానిసలు చేయడం కాదా అన్న ప్రశ్న వస్తోంది.

మరి ఇలాగైతే మద్య నిషేధం ఎలా అమలు చేస్తారు అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి మద్యం అమ్మకాలను పెంచడం ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడానికె ఇలా చేశారు అని అంటున్నారు. ఈ ఏడాది మద్యం ఆదాయం పాతిక వేల కోట్లుగా టార్గెట్ పెట్టుకున్నారని ఈ ఆర్ధిక సంవత్సవం ముగిసేనాటికి దాన్ని రీచ్ కావడానికే ఇలా సడెన్ గా రేట్లు తగ్గించారు అంటున్నారు.

అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం అక్రమ మద్యం అరికట్టడానికి నాటు సారా వాడకాన్ని పూర్తిగా రూపుమాపడానికే ఈ నిర్ణయం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలకు మద్యం అన్నది ప్రధాన ఆదాయంగా మారి చాలా దశాబ్దాలు అవుతోంది. ఏపీ లాంటి రాష్ట్రానికి ఏ వైపు చూసినా ఆదాయం రావడం లేదు, అందుకే ఇపుడు మద్యం అమ్మకాలను పెంచుకోవడానికే ఇలా చేశారని ప్రతిపక్షాలు అన్న దాంట్లో నిజముందా అంటే చూడాలి మరి.

Tags:    

Similar News