కొడాలి నానిపై భ‌గ్గుమ‌న్న నెటిజ‌న్లు.. కార‌ణ‌మిదే!

Update: 2022-06-20 10:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మాజీ మంత్రి, గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై నెటిజ‌న్లు భ‌గ్గుమంటున్నారు. కొడాలి నాని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుడివాడ బ‌స్టాండ్ లోకి కాలుపెట్ట‌డం కూడా గ‌గ‌నంగా ఉండ‌టంతో ఆయ‌న‌ను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి గుడివాడ బ‌స్టాండ్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి కొడాలి నానిపై మండిప‌డుతున్నారు.

నెటిజ‌న్ల‌కు ఆక‌స్మాత్తుగా కొడాలి నానిపై ఇంత‌కోపం ఎందుకొచ్చిందంటే.. గుడివాడ ప‌ట్ట‌ణం కృష్ణా జిల్లాలో ఒక ముఖ్య ప‌ట్ట‌ణంగా ఉంది. ప్ర‌స్తుతం గుడివాడ ఒక మునిసిపాలిటీగా ఉంది. రెవెన్యూ డివిజ‌న్ కూడా. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి గ‌త 19 ఏళ్ల నుంచి కొడాలి నానినే ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే 2004 నుంచి కొడాలి నానినే ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2004, 2009ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నాని 2014, 2019ల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

కొడాలి నాని 19 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా.. గ‌త మూడేళ్లు మంత్రిగా ఉన్నా ఇంత‌వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఎక్క‌డి వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు ముఖ్య కూడ‌లిగా ఉన్న గుడివాడ బ‌స్టాండ్ ప‌రిస్థితి ఘోరాతిఘోరంగా ఉంద‌ని అంటున్నారు.

ఇప్పుడు వ‌ర్షాకాలం కూడా ప్రారంభం కావ‌డంతో బ‌స్టాండ్ నిండా నీళ్లు నిల‌వ‌డంతోపాటు బుర‌ద‌, మురికికూపంగా మారింద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ప్ర‌యాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది ప‌డుతున్నా మీ క‌ళ్ల‌కు క‌నిపించ‌డం లేదా కొడాలి నానిని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

ప్ర‌తిప‌క్ష నేత‌లు చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, బీజేపీ నేత పురందేశ్వ‌రి త‌దిత‌రుల‌ను బూతులు తిట్ట‌డంలో ఉన్న శ్ర‌ద్ధ బ‌స్టాండ్ ను బాగు చేయ‌డంలో ఎందుకు లేద‌ని గ‌ట్టిగా నిల‌దీస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విమ‌ర్శ‌లు త‌ర్వాత ముందు గుడివాడ బ‌స్టాండ్ సంగ‌తి తేల్చ‌మ‌ని నెటిజ‌న్లు కొడాలి నానికి ఆల్టిమేటం జారీ చేస్తున్నారు.

అందులోనూ ర‌వాణా శాఖ మంత్రిగా ఇటీవ‌ల కాలం వ‌ర‌కు గుడివాడ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం మచిలీప‌ట్నం (బంద‌రు) ఎమ్మెల్యే పేర్ని నానినే ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నానిల మ‌ధ్య అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా స‌రే గుడివాడ బ‌స్టాండ్ అభివృద్ధిని కొడాలి నాని ఏమాత్రం ప‌ట్టించుకోలేదని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News