బాబూ...ఇది మాస్కో కాదు...మియాపూర్!

Update: 2017-12-05 11:25 GMT
హైద‌రాబాద్ లో గ‌త నెల 28 న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ప్ర‌తిష్టాత్మ‌క మెట్రో రైలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మెట్రో రైలు కోసం న‌గ‌ర‌వాసులు చాలా కాలంగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. మెట్రో రాక‌తో త‌మ ట్రాఫిక్ క‌ష్టాలు తీరిపోతాయ‌ని - తామంతా బేఫిక‌ర్ గా న‌గ‌రాన్ని చుట్టేయొచ్చ‌ని అనుకున్నారు. అనుకున్న విధంగానే  తొలిరోజు మెట్రోలో ప్ర‌యాణించేందుకు న‌గ‌ర‌వాసులు ఎగ‌బ‌డ్డారు. టికెట్ ధ‌ర‌లు కొద్దిగా ఎక్కువ‌గా ఉన్నాయ‌నే టాక్ ఉన్న‌ప్ప‌ట‌కికీ `మెట్రో` లో ప్ర‌యాణానుభూతి కోసం న‌గ‌ర‌వాసులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ప్రారంభోత్స‌వం రోజునే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఓ మోస్త‌రు ర‌ద్దీ క‌నిపిస్తోంది. చాలామంది సెల‌బ్రిటీలు కూడా మెట్రో లో ప్ర‌యాణించి త‌మ సెల్ఫీల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఈ త‌ర‌హా `సెల్ఫీ` సెల‌బ్రిటీల‌కు..... అన్ని `వ‌ర్గాల` ప్ర‌జ‌ల‌తో కిక్కిరిసిన మెట్రో కోచ్ ల‌లో ప్ర‌యాణం కాస్తంత ఇబ్బందిగా ఉంద‌ట‌.  

ఆ  సో కాల్డ్ సెల‌బ్రిటీలు మ‌న మెట్రోను.....మాస్కోతో పాటు కొన్ని ఫారిన్ మెట్రో రైళ్లతో పోల్చేస్తున్నారు. ఈ `సెల్ఫీ రాజా`లంద‌రూ....ఆ మెట్రో రైళ్ల త‌ర‌హాలోనే మ‌న మెట్రోల‌లో కూడా పాష్ గా ప్ర‌యాణించాల‌ని భావించి భంగ‌ప‌డుతున్నారు. మాస్కో మెట్రోలో సైలెంట్ గా దూర‌దూరంగా నిల‌బ‌డి పుస్త‌కాలు తిర‌గేస్తున్న ప్ర‌యాణికుల ఫొటోల‌ను - మ‌న మెట్రోలోని `స‌గ‌టు` హైద‌రాబాదీ ప్ర‌యాణికుల ఫొటోల‌ను ప‌క్క‌ప‌క్క‌న పెట్టి సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. సాధార‌ణ ప్రజానీకం మెట్రోలో ప్ర‌యాణించ‌డం పెద్ద‌గా ఇష్టం లేన‌ట్లు ఈ `దొర‌బాబు`లు పోస్టులు పెడుతున్నారు. అయినా, పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న‌ట్లు...ఉంది వారి ప‌రిస్థితి. ఫారిన్ కల్చ‌ర్ కు మ‌న క‌ల్చ‌ర్ కు చాలా తేడా ఉంద‌న్న విష‌యం వారి `టెక్కు`బుర్ర‌కు త‌ట్ట‌లేదు కాబోలు. మ‌న రైళ్ల‌లో జ‌రిగిన‌న్ని ఇష్టా గోష్టులు - చ‌ర్చ‌లు....ఫారిన్ రైళ్ల‌లో జ‌ర‌గ‌వు క‌దా. పోనీ, ఫారిన్ లో లాగే మెట్రోను తీర్చి దిద్దుదాం అనుకుంటే....అక్క‌డి మిగ‌తా వ్య‌వ‌హారాలు కూడా మ‌నం ఫాలో అయిపోవాలి కదా? కాబ‌ట్టి, ఎవ‌రి క‌ల్చ‌ర్ ను, పరిస్థితుల‌ను బ‌ట్టి వారు నడుచుకోవాల‌న్న కాన్సెప్ట్ ను ఆ సోకాల్డ్ సెల‌బ్రిటీలు గుర్తిస్తే మంచిద‌ని అదే సోష‌ల్ మీడియాలో రిటార్టు పోస్టులు కూడా వ‌స్తున్నాయి. మ‌న మెట్రోపై ఆ కొంత‌మంది మ‌రీ ఓవ‌ర్ గా అంచ‌నాలు పెంచేసుకున్నార‌ని రివ‌ర్స్ సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News