సినిమా హాళ్లేనా ? స్కూళ్లలో పిల్లల సౌకర్యాల పై తనిఖీ చేయరా?

Update: 2021-12-26 07:32 GMT
ఏపీలో జ‌రుగుతున్న కీల‌క వ్య‌వ‌హారంపై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా టికెట్ల ధ‌ర ల‌ను త‌గ్గించిన ప్ర‌భుత్వం దీనిని అమ‌లు చేయ‌ని.. థియేట‌ర్ల‌పై నిఘా నెపంతో వేధిస్తున్న విష‌యం తెలి సిందే. గ‌డిచిన నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్న‌డూ లేని విధంగా.. రాష్ట్ర వ్యాప్తంగా.. పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు, రెవెన్యూ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని.. వాటికి తాళాలు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక థియేట‌ర్లు మూత‌బ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యం లో ఆయా ధియేట‌ర్ల‌లో ప‌నిచేస్తున్న సిబ్బంది రోడ్డున ప‌డుతున్నారంటూ.. అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ లు వ‌స్తున్నాయి.

ప్రకాశం జిల్లావ్యాప్తంగా బీ-ఫాంతో పాటు లైసెన్సు రెన్యువల్‌ లేని 28 థియేటర్ల యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు.  చిత్తూరు జిల్లా పీలేరులో 4 థియేటర్లుండగా.. మూడింటిని తనిఖీ చేసి రూ.36వేల చొప్పున జరిమానా విధించారు. కాణిపాకంలో 30ఏళ్లుగా నడుస్తున్న వినాయక టాకీస్‌ ఆలయ భూముల్లో ఉందని, రెన్యువల్‌ చేయడం కుదరదని అధికారులు తేల్చడంతో ఆ థియేటర్‌ మూతపడింది. మదనపల్లెలోని 7 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. ఫ‌లితంగా ఆయా ధియేట‌ర్ల‌లో సినిమాలు ఆగిపోయాయి.

అదేవిధంగా విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో మహేశ్వరీ థియేటర్‌ను.. ప్రభుత్వం చెప్పిన రేట్లకే టికెట్లు అమ్మాలని లేకుంటే హాలు సీజ్‌ చేస్తామనడంతో యాజమాన్యం థియేటర్‌ను మూసివేసింది. అలాగే ఎస్‌.రాయవరంలో బాలత్రిపుర సుందరి థియేటర్‌ను కూడా మూసివేశారు.  తూర్పుగోదావరి జిల్లాలో 134 థియేటర్లు ఉండగా, 37 గ్రామ పంచాయతీల పరిధిలోని 57 థియేటర్లను మూసివేశారు. దీంతో ఆయా ధియేట‌ర్ల‌లో ప‌నిచేస్తున్న అన్ని ర‌కాల సిబ్బంది రోడ్డున ప‌డిన‌ట్టు అయింది.

ఇక‌, ఈ ఘ‌ట‌న‌ల‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. జేసీలు, రెవెన్యూ అధికారులు చేస్తున్న త‌నిఖీలు సినిమా ధియేట‌ర్ల‌కే ప‌రిమిత‌మా? అంటూ.. ప్ర‌శ్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో మీ స‌మీపంలోనే ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను త‌నిఖీ చేయాల‌ని.. అక్క‌డ అమ‌ల‌వుతున్న మ‌ధ్యాహ్న భోజ‌నం, మ‌రుగు దొడ్లు, త‌ర‌గ‌తి గ‌దుల‌ను కూడా ప‌రిశీలించాల‌ని.. నిబంధ‌న‌ల‌ను పాటించ‌ని ఈ పాఠ‌శాల‌ల‌పైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా స‌మీపంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను కూడా ప‌రిశీలించాల‌ని.. అక్క‌డ రోగుల‌కు అందుతున్న వైద్యం ఏవిధంగా ఉందో చూడాల‌ని .. వారు కోరుతున్నారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏనాడైనా..ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు.. పాఠ‌శాల‌ల్లోఉన్న మౌలిక స‌దుపాయాల‌పై త‌నిఖీలు చేశారా? అని నిల‌దీస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న‌లు.. వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి అధికారులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News