అదేంటి కేటీఆర్? నాన్నలా సైలెంట్ గా పని చేయకుండా ఈ మాటలేంది?

Update: 2021-05-29 03:29 GMT
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గమనిస్తున్నారా? అదే సమయంలో ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ మాటల్ని వింటున్నారా? సెకండ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోకుండా.. రాష్ట్ర ఆదాయం మీదనే ఎక్కువన్నట్లుగా వ్యవహరించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర హైకోర్టు జోక్యంతో పాటు.. చేసిన ఘాటు వ్యాఖ్యలతో లాక్ డౌన్ ను హడావుడిగా విధించటం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలంగాణలోనూ కేసులు భారీగా పెరగటం.. వైద్య సేవ కోసం సామాన్యులు పడిన ఆగచాట్లు.. ఆక్సిజన్.. రెమ్ డెసివర్.. కార్పొరేట్ వైద్యం కోసం ఆస్తులు అమ్మేసిన కథనాలు కేసీఆర్ లో కొత్త ఆలోచనలకు తెర తీశాయన్న మాట వినిపిస్తోంది. అదే.. ఆయన్ను కొత్త తరహాలో ఆవిష్కరించేలా చేసినట్లు చెబుతున్నారు.

మాటల్లేకుండా.. కేవలం చేతలతోనే తానేమిటి? తన కమిట్ మెంట్ ఏమిటన్న విషయాన్ని చేసి చూపిస్తున్న సీఎం కేసీఆర్ గడిచిన పది రోజుల్లోనే చాలానే నిర్ణయాలు తీసుకున్నారు. ఆ మాటకు వస్తే.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారు. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జూడాల సమ్మెనే చూస్తే.. గతంలో మాదిరి కాకుండా.. రోజుల్లో ఇష్యూను క్లోజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో సీఎం కేసీఆర్ ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తే.. మంత్రి కేటీఆర్ మాత్రం మాటలతో వాతావరణాన్ని వేడెక్కించారని చెప్పాలి.

కరోనా వేళ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న అనునయ మాటలు కేసీఆర్ నోటి నుంచి వస్తే.. చర్యలు తప్పవన్న వార్నింగ్ కేటీఆర్ నోటి నుంచి వచ్చింది. ఇలా మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కేసీఆర్ పని చేసుకుంటూ పోతుంటే.. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ మాత్రం మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా ఆయన్ను చూస్తే.. లాక్ డౌన్ వేళలోనూ.. ఆయన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనటం కనిపిస్తోంది. ఆ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మాటల కంటే కూడా పనులు మనమేమిటన్న విషయాన్ని చెప్పేలా చేయాలి.

ఈ నెల మొదట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేవి. కట్ చేస్తే.. నెలాఖరుకు వచ్చేసరికి ఆయనపై విమర్శల జోరు తగ్గటమే కాదు.. వడి వడిగా నిర్ణయాలు తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడటం.. సోషల్ మీడియాలో హడావుడి చేయకుండానే తాను చేస్తున్న పనులు మాట్లాడేలా చేస్తున్న కేసీఆర్ తీరును మంత్రి కేటీఆర్ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.  తండ్రికి మించినట్లుగా చేతల్లో చూపించాల్సిన కేటీఆర్.. ఈ మధ్యన ఆ పాయింట్ ను మిస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News