ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారుగా?

Update: 2021-05-14 05:30 GMT
కష్టం వచ్చినప్పుడు మేం ఉన్నామంటూ ముందుకు వచ్చి.. భరోసా ఇవ్వటం అందరికి చేతనయ్యే విషయం కాదు. అందునా కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలతో నేరుగా మాట్లాడటం అంత ఈజీ కాదు. ఎలాంటి పరిస్థితినైనా సరే.. హ్యాండిల్ చేయగలిగిన సత్తా ఉందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు తెగ ప్రయత్నించే మంత్రి కేటీఆర్.. తాజాగా ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విటర్ లో రెండు గంటల పాటు లైవ్ లో కూర్చొని.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇప్పటికే ఇలాంటివి పలుమార్లు చేసిన ఆయనకు.. తాజాగా మాత్రం కొత్త అనుభవం ఎదురైంది.

గతంలో మాదిరి కులాశాగా కబుర్లు చెప్పలేని పరిస్థితి. ప్రజల నుంచి వస్తున్న వినతులు.. సందేహాలు.. సమస్యలు.. సూటి ప్రశ్నలకు ఆయన అంతే ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు. అన్నింటికి మించి ప్రైవేటు..కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ.. ఆక్సిజన్ కొరత.. పడకలు లేక పిట్టల్లా ప్రాణాలు రాలిపోతున్నాయన్న ఆవేదన ఎక్కువ కనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేవని రోగుల్ని తిప్పి పంపిస్తుండటంతో పేదలు ఇళ్లల్లోనే చనిపోయారన్న ఆందోళన వ్యక్తమైంది.

కొవిడ్ టాస్కు ఫోర్సును సారథ్యం వహిస్తున్న ఆయన.. సమస్యలపై అవగాహన కోసం.. డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా లాభించలేదని చెప్పాలి. చాలామంది నెటిజన్లు ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై నిలదీయటం.. జీవితకాలం పాటు కూడబెట్టిన ఆస్తుల్ని ఆసుపత్రులకు పెట్టాల్సిందేనా? అని ప్రశ్నించారు. అన్నింటికి మించి కొవిడ్ ను ఆరోగ్య శ్రీ కిందకు ఎప్పుడు తీసుకొస్తారంటూ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పలేకపోయారు.

అంతేకాదు.. ఆక్సిజన్ కొరత.. రెమ్ డెసివిర్ ను అందించాలన్న విన్నపాల్ని కూడా చేశారు. మిగిలిన సందేహాలకు ఇట్టే సమాధానం ఇచ్చిన కేటీఆర్.. ఆసుపత్రుల దోపిడీ.. అడ్డగోలు వసూళ్లు లాంటి వాటిపై మాత్రం మౌనాన్ని ఆశ్రయించారే తప్పించి.. సమాధానం చెప్పలేకపోయారు. దీంతో.. గతానికి భిన్నంగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
Tags:    

Similar News