తెలంగాణకు షాకింగ్ గా డబుల్ సెంచరీ..8 తర్వాత సంగతేంటి?

Update: 2020-06-07 05:50 GMT
తెలంగాణ రాష్ట్రంలో మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తోంది. ఒక్క కేసుతో మొదలైన ప్రయాణం.. చాలా నెమ్మదిగా.. కట్టడి చేసే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా ఆశలు కల్పించిన స్థాయి నుంచి.. ఇప్పుడేమవుతుందన్న ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి తెలంగాణలో చోటు చేసుకుంది. మార్చిలో మొదలైన మొదటి పాజిటివ్ కేసు సంగతి తెలిసిందే. తాజాగా శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఒక్కరోజులోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 206 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో హైదరాబాద్ మహానగర వాటానే 152 కావటం షాకింగ్ గా మారింది.

ఇంత భారీగా పాజిటివ్ కేసులు నమోదుకావటం ఇదే తొలిసారి. తెలంగాణలో అత్యధిక కేసుల రికార్డు నమోదైన రోజునే.. గ్రేటర్ హైదరాబాద్ లోనూ అత్యధిక కేసుల చెత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల్లో శనివారమే అత్యధికం. ఇదిలా ఉంటే.. గడిచిన వారంలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఒక నెలలో నమోదైన కేసుల కంటే.. గడిచిన పది రోజుల్లో నమోదైన కేసులే అత్యధికమన్న మాట వినిపిస్తోంది.

లాక్ డౌన్ సడలింపుతో కేసుల నమోదు పెరుగుతుంటే.. ఇటీవల కాలంలో ఆ జోరు మరింత పెరిగింది. అన్ని ఆంక్షలు ఎత్తేసి.. పోలీసు చెక్ పోస్టులు తొలగించిన తర్వాత కేసుల విస్తరణ అంతకంతకూ పెరుగుతుందని చెప్పకతప్పదు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే సోమవారం నుంచి రెస్టారెంట్లు.. మాల్స్ ప్రారంభమైతే పరిస్థితి ఏమిటి? అన్నది ఆలోచించటానికే భయం కలిగే పరిస్థితి.

గడిచిన నాలుగైదు రోజులుగా వందకు కాస్త అటు ఇటుగా నమోదవుతున్న పాజిటివ్ లు శనివారం ఏకంగా 150కు పైగా నమోదు కావటం కొత్త టెన్షన్ కు కారణమవుతుంది. ఇదే తీరు కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి మరెలా తయారవుతుందన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇప్పటికే భౌతికదూరంతో పాటు.. మాస్కులు పెట్టుకొని బయటకు రావాలన్న సూచనలు ఏమీ అమలు కావటం లేదంటున్నారు.

ఇలాంటివేళ.. ఆన్ లాక్ 1.0 జోరు మరింత పెరిగితే.. పాజిటివ్ కేసుల ముప్పు భారీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. జులై మధ్య నాటికి ఇబ్బందికర పరిస్థితి తప్పదంటున్నారు. మరి.. కేసుల కట్టడి విషయంలో తన యాక్షన్ ప్లాన్ ఏమిటో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News