ఏపీ కంటే తెలంగాణలో పరిస్థితి మరింత దిగజారుతోందా?

Update: 2020-06-12 04:45 GMT
ప్రపంచం గురించి పట్టించుకోవద్దు. దేశంలోని ఇతర రాష్ట్రాల సంగతిని వదిలేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికే వద్దాం. మొన్నటివరకూ మాయదారి రోగానికి సంబంధించిన గణాంకాల్ని చూస్తే.. ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే పరిస్థితి చక్కగా ఉందన్నట్లుగా కనిపించేది. వాస్తవానికి ఏపీ కంటే చాలా ముందుగా తెలంగాణలో పాజిటివ్ కేసు నమోదైంది. ఓపక్కతెలంగాణలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసు నమోదవుతుంటే.. ఏపీలో షురూనే కాని పరిస్థితి.

అందుకు భిన్నంగా తర్వాతి కాలంలో తెలంగాణలో తీసుకున్న కట్టడి చర్యలు ఫలితాన్ని ఇచ్చి.. కేసుల నమోదు తగ్గింది. దీనికి తోడు తెలంగాణలో నిర్దారణ పరీక్షలు తక్కువ చేయటం.. ఏపీలో ఎక్కువ చేయటంలో పాజిటివ్ కేసుల నమోదు ఆంధ్రప్రదేశ్ లో అంతకంతకూ ఎక్కువైంది. చూస్తుండగానే.. తెలంగాణ కంటే ఏపీలోనే పాజిటివ్ కేసుల నమోదు పెరిగిపోయాయి.

కొత్తగా నమోదవుతున్నకేసుల తీవ్రత ఏపీ కంటే తెలంగాణలోనే తక్కువగా ఉన్నాయి. గడిచిన పది రోజుల్లో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకూ రోజుకు 70-80 మధ్యనే పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. ఆ స్థానంలో ఇప్పుడు వందకు తగ్గట్లేదు. మధ్యమధ్యలో 200 కేసులు కూడా నమోదవుతున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు గురువారం నాటి పరిస్థితే తీసుకుంటే..209 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ మహానగరంలోనే అత్యధికంగా 175 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో ఏపీలో నిర్దారణ పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్నా.. నమోదవుతున్నకేసులు తక్కువగా ఉండటం గమనార్హం. గురువారం సంగతే చూస్తే.. ఏపీలో 182 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి గడిచిన కొద్దిరోజులుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవే కాదు.. మరణాలు సైతం ఇటీవల తెలంగాణలో ఎక్కువ అవుతున్నాయి. ఏపీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నా.. మరణాలు తక్కువగా ఉంటే.. తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కేసులు 5,429 కాగా.. తెలంగాణలో 4,320 కేసులు. ఇదిలా ఉంటే.. మరణాల విషయానికి వస్తే.. ఏపీలో 80 మంది మాత్రమే మహమ్మారి బారిన పడి మరణించగా.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా 165 మరణాలు చోటు చేసుకున్నాయి. గురువారం విషయానికే వస్తే.. ఏపీలో ఇద్దరు మరణిస్తే.. తెలంగాణలో అందుకు భిన్నంగా 9 మంది మరణించటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే.. లాక్ డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో కేసుల తీవ్రత.. మరణాల నమోదు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ గణాంకాల్ని చూసిన తర్వాతైనా సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News