దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు - కొత్తగా ఎన్నంటే?

Update: 2020-08-13 05:15 GMT
భారత్‌ లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల తీవ్రత యధాతథంగా పెరుగుతూ ఉంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.  గడిచిన 24 గంటల్లో భారత్ లో అత్యధికంగా 66,999 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,96,638కు చేరింది. బుధవారం రికార్డు స్థాయిలో 942 మంది కరోనాతో మృత్యువాతపడటంతో ఇప్పటి వరకు 47,033 మంది కరోనా తో కన్నుమూశారు. దీంతో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో భారత్‌ యూకేను దాటేసి నాలుగో స్థానానికి ఎగబాకింది.

భారత్‌ లో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్‌ కేసులు ఉండగా, 16,95,982 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 70 శాతం ఉంది.  కాగా, నిన్నటి వరకు మొత్తం 2,68,45,688 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,30,391 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. మొత్తం కేసుల పరంగా చూస్తే అత్యధికం మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఏపీ ఉన్నాయి.

ఇక, తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజూ భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిన్న కొత్తగా 23,303 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,931కి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,475కు పెరిగింది. నిన్న కొత్తగా 11 మంది కరోనా  కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 665కు పెరిగింది.

ఇక , ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,597 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. మరో 93 మంది మరణించారు. ఏపీలో ఇప్పటివరకు  నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. కరోనాను జయించి వీరిలో 1,61,425 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 90,425 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,296 మంది మరణించారు


Tags:    

Similar News