కొత్త ప్రశ్నలకు తెర మీదకు తెచ్చిన కవితక్క ‘అల్లిపూల’ పాట

Update: 2021-10-06 03:48 GMT
కొన్ని పనులు కొందరు చేయకూడదు. ప్రచారం కోసం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు అభాసుపాలు కావటం ఖాయం. అందునా.. తమ ప్రాంతాన్ని.. కల్చర్ ను విపరీతంగా అభిమానించి.. ఆరాధించే రాష్ట్రంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఈ విషయంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత ఫెయిల్ అయ్యారనే మాట పలువురి నోట వినిపిస్తుంది.

దక్షిణాదిన తమ ప్రాంతం మీదా..తమ భాష మీద.. తమ కల్చర్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే వారిగా తమిళులకు పేరుంది. అసలే మాత్రం రాష్ట్రం మీద ఎమోషన్ లేని వారిగా ఆంధ్రోళ్లగా వారికి వారే చెప్పుకుంటారు. ఆంధ్రోడిగా పుట్టటమే అతడు చేసిన పొరపాటు. లేకుంటే ఎక్కడో ఉండేవాడన్న మాట.. చాలా రంగాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో.. తెలంగావాదానికి ఎంతటి ప్రాధాన్యత ఉందన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తేనే అర్థమవుతుంది.

స్వాభిమానం కోసం.. సొంత రాష్ట్రం కోసం అవిశ్రాంతిగా పోరాడిన రాష్ట్ర ప్రజలు ఎట్టకేలకు సొంత రాష్ట్రాన్నిఏర్పాటు చేసుకొని ఏడున్నరేళ్లుగా బతుకు బండి లాగుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. తమదైన ముద్ర కోసం తెలంగాణవారు అనుక్షణం ఆరాటపడటం కూడా రాష్ట్రం మరింత ముందుకు వెళ్లేలా చేస్తోంది. తాము టచ్ చేసిన తెలంగాణవాదాన్ని.. వారే మర్చిపోవటం ఏమిటన్న ప్రశ్న తాజాగా కవితక్కకు ఎదురవుతుంది.

బతుకమ్మ సంబురానికి గుర్తుగా ఎమ్మెల్సీ కవిత.. తాజాగా ‘అల్లిపూల వెన్నల’  పాటను విడుదల చేశారు. ఈ పాట కోసం ఆమె ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ను.. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ తో చేయించారు. ఈ పాట షూటింగ్ ను నల్గొండ జిల్లాలో చేయించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ పాట పట్ల విపరీతమైన ఆసక్తి వ్యక్తమైంది. అయితే.. .పాటను చూసినోళ్లంతా పెదవి విరుస్తున్నారు. అదే సమయంలో పలు ప్రశ్నల్ని సంధిస్తున్నారు.

తెలంగాణ బతుకు చెప్పే బతుకమ్మ పాట చిత్రీకరణకు ఒక మలయాళీ (గౌతమ్ మీనన్) దర్శకత్వం వహించాలా? ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ పండుగ ఎంతో కీలకం. అలాంటిది దాని ప్రాశత్యాన్ని తెలిపే పాటకు సంగీతానికి ఒక తమిళుడు (ఎఆర్ రెహమాన్) కావాలా? చివరకు పాట పాడిన గాయని ఉత్తర ఉన్నికృష్ణన్ కూడా తమిళురాలే.

తెలంగాణ ఉద్యమంలో.. ‘ఫలానా దానిలో తెలంగాణ వారికి అవకాశం కల్పించరా’ అని గళమెత్తిన వారు రూపొందించిన పాటలో.. తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఏమిటి?
మన పాటను.. అంతే వైభవంగా.. అంతే గొప్పగా మనోళ్లు పాడరా? సంగీతం అందించలేరా? దర్శకత్వం వహించలేరా? అన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు. తాజా ‘అల్లిపూల వెన్నల’లో తెలంగాణ ఆత్మ మిస్ అయ్యిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అయినా.. తెలంగాణ బతుకును చెప్పే బతుకమ్మ పాటను గ్రాండ్ గా చూపించటం కోసం పర రాష్ట్రీయులకు అప్పజెప్పటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణవాదాన్ని బలంగా వినిపించే కవితక్క.. అదే తెలంగాణ సెంటిమెంట్ ను అలా ఎలా మిస్ అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News