కరోనాకు చికిత్స కి కొత్త మందు ... హైదరాబాద్ లో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ !

Update: 2021-05-22 10:30 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ మొదలయ్యాక పలు రకాల వ్యాక్సిన్ల కోసం పరిశోధనలు మొదలయ్యాయి. ఇవి తాజాగా ఫలించడంతో ఒక్కొక్కటిగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. భారత్‌ లోనే రెండు దేశీయ వ్యాక్సిన్లు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ అభివృద్ధి చేశారు. అలాగే అమెరికా, బ్రిటన్, యూరప్‌ దేశాల నుంచి ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, సినోవాక్‌, మోడర్నా వంటి వ్యాక్సిన్లు మార్కెట్‌ ను ముంచెత్తేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు దశలో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న మోల్నుఫిరావిర్‌–400ఎంజీ’మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కు సిద్ధమైంది.

మన దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ లోని యశోద ఆస్పత్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య తెలిపారు. నాట్కో ఫార్మాతో కలసి యశోద ఆస్పత్రిలో ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లో జంతువులతో పాటు కరోనా వైరస్  బాధితులపై పరిశోధనలు నిర్వహించగా, మంచి ఫలితాలు వచ్చాయని, ఏ ఒక్కరిలో కూడా దుష్ఫలితాలు తలెత్తలేదని చెప్పారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ భారీ నుంచి వారంతా కోలుకున్నట్లు ప్రకటించారు. మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 34 ఆస్పత్రుల్లో 1,218 మందిని ఈ ట్రయల్స్‌ కు ఎంపిక చేయగా, యశోద ఆస్పత్రిలో 50 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ బారిన పడి మైల్డ్‌ సింప్టమ్స్‌ తో బాధపడుతున్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారిని ఇందుకు ఎంపిక  చేస్తారు. 5 రోజుల పాటు ఈ మందులు వాడి, ఆ తర్వాతి రోజు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా, నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా బాధితులను ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఓపీలోనే చూసి రెండు పూటలా ఈ మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వైద్య బృందం ఐదు, పది, పదిహేను రోజుల్లో వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు ప్రకటించారు.

బ్రిటన్‌ కు చెందిన ప్లిమత్‌ యూనివర్సిటీతో పాటు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కరోనా చికిత్స కోసం వ్యాక్సిన్లకు బదులుగా నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ డ్రగ్‌ ను కనిపెట్టారు. ఎంకే-4482 లేదా మోల్నుపిరావిర్‌గా పిలిచే ఈ డ్రగ్‌ ను నోటి ద్వారా తీసుకోవచ్చు. కరోనా వైరస్ సోకడానికి 12 గంటల ముందు లేదా కరోనా  సోకిన 12 గంటల తర్వాత కానీ దీన్ని నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో ఈ మోల్నుపిరావిర్ డ్రగ్‌ ను నోటి ద్వారా తీసుకుంటే ఆ రిస్క్‌ గణనీయంగా తగ్గిస్తుందని శాస్తవేత్తలు చెప్తున్నారు. కరోనాలో ఇప్పటివరకూ బయటపడిన వైరస్‌ లతో పాటు ఇతర వైరస్‌లపైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించారు.
Tags:    

Similar News