తెలుగు రాజ‌కీయ‌ య‌వ‌నిక‌పై మ‌రో పార్టీ..?

Update: 2017-11-14 10:15 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించడం చాలా క‌ష్టం. అనేక సంద‌ర్భాల్లో స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పురుడుపోసుకున్న పార్టీలు అవ‌కాశాన్ని అందిపుచ్చుకుని అధికారాన్ని అందుకున్నాయి. తెలుగునేల‌పై ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం - త‌మిళ‌నాడులో డీఎంకే - అన్నాడీఎంకే - ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో బీఎస్పీ - ప‌శ్చిమ బెంగాల్లో త‌ృణ‌మూల్ కాంగ్రెస్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్ద‌దే ఉంది. ఇవ‌న్నీ ఆయా రాష్ట్రాల్లో స్థానిక రాజ‌కీయ ప‌రిస్థితులు - ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే అంశాల‌ను అందిపుచ్చుకుని ఏర్ప‌డిన పార్టీలే. అనంత‌రం ప్ర‌జాకాంక్ష‌కు అనుగుణంగా అధికారం చేప‌ట్టాయి. స‌రిగ్గా ఇదే త‌ర‌హాలో ఆంధ్రప్ర‌దేశ్‌ లో ఓ కొత్త రాజ‌కీయ పార్టీ తెర‌పైకి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు.. ఆ పార్టీ మాజీ నేతలు కొందరితో కలిసి.. సమాజాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల వ్య‌క్తుల‌ను క‌లుపుకొని పార్టీని ఏర్పాటు చేసేందుకు చురుగ్గా పావులు క‌దుపుతున్నారు. దీని కోసం ఉత్తరప్రదేశ్ లో మాయావతి రూపొందించిన‌ ఫార్ములానే అనుస‌రించించాల‌ని వారు భావిస్తున్నార‌ట‌. గెలుపోట‌ముల విష‌యంలో నిర్ణాయ‌క శ‌క్తులుగా ఉన్న‌ కాపులు - దళితుల కాంబినేషన్లో పార్టీ ఏర్పాటుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని రాజకీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది.
    
కాపు ఉద్య‌మ‌ నేత ముద్రగడ పద్మనాభం సొంతూరు కిర్లంపూడిలో కాపుల నివాస ప్రాంతంలో ఇటీవ‌ల అంబేడ్క‌ర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ముద్రగడతో పాటు మాజీ ఎంపీలు హ‌ర్ష‌కుమార్‌ - చింతామోహన్‌ ఆవిష్కరించ‌డం రాష్ట్ర‌ రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో అంబేడ్క‌ర్‌ విగ్రహాన్ని అగ్ర‌వ‌ర్ణాలు తొలగించ‌డం రాష్ట్రంలో క‌ల‌క‌లం స‌ృష్టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీనిని ద‌ృష్టిలో ఉంచుకునే తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపుల నివాస ప్రాంతాల్లో కాపుల‌తో క‌లిసి ద‌ళిత నేత‌లు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశార‌ని.. దీని వెనుక ప‌లు రాజకీయ స‌మీక‌ర‌ణాలున్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇది కొత్త పార్టీ ఏర్పాటుకు నాందిగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే ప్రచారం మొదలైంది.
    
దళితులతో సఖ్యత కోరుకుంటున్నామనే సందేశాన్ని ఇవ్వడానికే ముద్రగడ అంబేడ్క‌ర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల్లోని కాపు సామాజిక వ‌ర్గ నేత‌ల‌ను ఆయ‌న క‌లిశారు. కాపులను బిసిల్లో చేర్చే విషయమై స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. స‌రిగ్గా ఇదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని విశ్వ‌విద్యాల‌యాల ప్రొఫెసర్లతో అమ‌లాపురం మాజీ ఎంపీ జీవీ హ‌ర్ష‌కుమార్ శ‌నివారం స‌మావేశం నిర్వ‌హించారు. మేథావి వ‌ర్గంతో హ‌ర్ష‌కుమార్ భారీ స‌ద‌స్సు నిర్వ‌హించ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. దళితులు ఐక్యంగా ఉంటే రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారం దళితులదేనని, తూర్పు నుంచే ముఖ్య‌మంత్రిని ఎన్నుకుంటామ‌ని.. యూపీ త‌ర‌హాలోనే రాష్ట్రంలోనూ మాయావతి ఫార్ములాను అమలు చేస్తామని మ‌రో మాజీ ఎంపీ చింతామోహన్‌ ఆ సమావేశంలో అన్నారు. కాపు, ద‌ళిత కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకోబోయే పార్టీ విధానాల రూప‌క‌ల్ప‌న కోసం వారి ఆలోచ‌న‌లు పంచుకునేందుకే ఈ స‌మావేశం జ‌రిగింద‌ని ప్ర‌చారం సాగుతోంది.
    
ఈ నేప‌థ్యంలో ముద్రగడ - హర్షకుమార్ - చింతామోహన్ కలయిక‌తో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కొత్త రూపు సంత‌రించుకుంటున్నాయి. కిర్లంపూడిలో జ‌రిగిన అంబేడ్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు కాంగ్రెస్ నేత‌లు హాజ‌రుకావ‌డం ప్ర‌చారానికి బ‌లం చేకూరుస్తోంది. విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి శైలజానాధ్‌, మాజీ ఎంఎల్ఏలు పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, కొప్పుల రాజు తదితరులు హాజరు కావడం వెనుక లోతైన వ్యూహం ఉంద‌ని భావిస్తున్నారు. దీనిపై మ‌రికొన్ని రోజుల్లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News