ఏపీకి గుడ్‌ న్యూస్‌ లో ఓ బ్యాడ్‌ న్యూస్‌

Update: 2018-09-26 17:28 GMT
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ షాకుల పరంపర కొనసాగుతుండ‌గా...ఊపిరి పీల్చుకునే క‌బురు ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. విభజనకు సంబంధించి ఇప్పటివ‌ర‌కు కొన్నింటినీ నెర‌వేర్చి ఎన్నింటినో పెండింగ్ లో  పెట్టిన కేంద్ర‌ప్ర‌భుత్వం ఏపీలో త‌మ మిత్ర‌పక్ష‌మైన టీడీపీతో నాలుగేళ్ల కాలంలో నెట్టుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నాలుగున్న‌రేళ్ల పోరాటం - అనివార్య స్థితిలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌కు రావ‌డం - ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో....కేంద్రం ఏపీకి ఓ తీపిక‌బురు అందించింది. త్వ‌ర‌లో అమ‌రావ‌తికి రైల్వే లైన్ మంజూరు కానుంద‌ని రైల్వే జీఎం వినోద్‌ కుమార్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. కాగా, దీన్ని ప‌లువురు ఆహ్వానిస్తూనే...ఏపీ ప్ర‌జ‌లు కోరుతుంది ఒక‌టైతే...కేంద్రం ఇచ్చేది మ‌రొక‌టి అని ఇంకొంద‌రు పేర్కొంటున్నారు.

వాస్త‌వానికి గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే రాజ్‌ నాథ్ సింగ్ ప్రకటనకు భిన్నంగా ఏపీకి అన్యాయం చేసేలా సుప్రీంకు కేంద్ర అఫిడవిట్ సమర్పించింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు స్పందిస్తూ కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే 16 జోన్లు ఉన్నందున కొత్త జోన్ లాభాదాయకం కాదని తెలిపిన రైల్వే శాఖ తెలిపిందని అఫిడవిట్ లో పేర్కొంది. విశాఖ  జోన్ విషయంలో  రైల్వే అధికారులు చేతులెత్తేశారని హోంశాఖ అఫిడవిట్ లో పేర్కొంది. ఇలా జోన్ ఆశ‌లు అడియాస‌లు అయిపోయిన త‌రుణంలో...దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్ కీల‌క హామీ  ఇచ్చారు.

విజయవాడలో విజయవాడ - గుంటూరు - గుంతకల్ రైల్వే డివిజన్ల పరిధిలోని పార్లమెంటు సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సమావేశమయ్యారు. అనంతరం వినోద్‌ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైను కోసం  883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి రైల్వే బోర్డుకు నివేదిక పంపినట్టు  తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. రెండు లైన్లకు సరిపడా భూసేకరణ జరుగుతుందన్నారు. తొలుత సింగిల్ లైన్ నిర్మిస్తామని - అనంతరం డిమాండ్‌ ను బట్టి రెండో లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో దక్షిణమధ్య రైల్వే జోన్ మొత్తం విద్యుద్దీకరణ పనులు పూర్తవుతాయని చెప్పారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్‌ ను 400 కోట్లతో పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్చి 2019 నాటికి విజయవాడ - గుంటూరు - గుంతకల్ కర్నూలు రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. విజయవాడ-విశాఖ మూడో లైన్ - నడికుడి-శ్రీకాళహస్తి మార్గం పనులు వేగంగా జరుగుతున్నట్టు ఆయన వివరించారు. అమ‌రావ‌తికి రైల్వే లైన్ ఓకే కానీ..అస‌లు జోన్ సంగ‌తి ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News