సంచ‌ల‌నం: వంద నోటూ వెళ్లిపోతోందిగా

Update: 2017-10-03 10:11 GMT
గ‌త ఏడాది న‌వంబ‌రు 8 నాటి ప‌రిస్థితి రేంజ్‌ లో కాక‌పోయినా.. మ‌రోసారి నోట్ల ర‌ద్దు విష‌యం తెర‌మీద‌కి వ‌చ్చింది. తాజాగా ప్ర‌స్తుతం చ‌లామ‌ణిలో ఉన్న రూ.100 నోటును కూడా ర‌ద్దు చేయాల‌ని రిజ‌ర్వ్ బ్యాంకు డిసైడ్ అయింది. ఇప్ప‌టికే దీనిపై అనేక వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో క్లారిటీ రాలేదు. అయితే, ఈ విష‌యంలో తాజాగా రిజ‌ర్వ్ బ్యాంకు క్లారిటీ ఇచ్చింది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత వంద రూపాయల నోట్లను క్రమంగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన‌ట్టు పేర్కొంది.

వీటి స్థానంలో కొత్త వంద రూపాయల నోట్లను ప్రవేశ పెట్టనున్నార‌ట‌. అయితే, వీటిని ఉపసంహ‌రిస్తే.. చిల్ల‌ర కొర‌త తీవ్ర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని, మార్కెట్లు విల‌విల‌లాడే ప్ర‌మాదం ఉంద‌ని గుర్తించి.. ఒకే సారి కాకుండా క్ర‌మ క్ర‌మంగా
వంద‌నోట్ల‌ను ఉప‌సంహ‌రించాల‌ని నిర్ణ‌యించార‌ట రిజ‌ర్వ్ బ్యాంకు అధికారులు. ఇక‌, కొత్త 200 రూపాయల నోట్లను ఇప్ప‌టికే మార్కెట్‌ లోకి విడుద‌ల చేసినా.. అవి చాలినంత మేర‌కు చ‌లామ‌ణిలో లేవ‌ని.. కాబ‌ట్టి వీటి ముద్ర‌ణ‌ను మ‌రింత పెంచి..  వచ్చే ఏడాది మార్చి కల్లా మార్కెట్లోకి పూర్తిగా ప్రవేశ పెట్టాల‌ని ప్రాధ‌మికంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఆ తర్వాత కొత్త వంద రూపాయల నోట్ల ముద్రణను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి పాత వంద నోట్ల‌ను ఉపసంహ‌రిస్తార‌ట‌. అయితే, నోటు సైజులో మార్పు లేకుండా పాత నోటు సైజులోనే కొత్తవాటిని ముద్రించాలని అధికారులు నిర్ణయించినట్టు ఆర్బీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త వంద రూపాయల నోటు ముద్రణ జరుగుతుందని వెల్లడించింది. సో.. పాత వంద‌కు ఇక కాలం చెల్లిన‌ట్టేన‌న్న‌మాట‌!!


Tags:    

Similar News