కరోనా పాజిటివ్..ఈ రోజు తెలంగాణలో 40 - ఏపీలో 10

Update: 2020-04-07 17:02 GMT
నవ్యాంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం దాకా పరిస్థితి అదుపులోనే ఉందన్న భావన వ్యక్తమైనా... ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిలో కరోనా బాధితులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో గడచిన వారం  రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగిపోయింది. మంగళవారం   రాత్రి 9 గంటల సమయానికి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 314కు చేరింది. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ కేసులే ఎక్కువగా  ఉండటం గమనార్హం. అంటే... ఢిల్లీ లింకులతోనే ఏపీలో కరోనా విజృంభణ అమాంతంగా పెరిగిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే... రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314కు చేరితే... కరోనా లక్షణాలతో ఉన్న వారికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందట. ఈ రిపోర్టులలో ఎంత మందికి కరోనా సోకిందన్న విషయంపై అటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గురువారం కొత్తగా నమోదైన కేసుల్లో కృష్ణా - నెల్లూరు - గుంటూరు - జిల్లాలకు చెందిన కేసులే అధికంగా ఉన్నాయి.

ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోనే ఏపీలో కరోనా విజృంభణ ఈ రేంజిలో ఉందని చెప్పక తప్పదు. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోనూ ఢిల్లీ లింక్డ్ కారణంగానే గుంటూరు - కర్నూల్ - నెల్లూరు ఈ మోతాదులో కరోనా కేసులు బయటపడుతున్నాయని చెప్పాలి.

ఇక మంగళవారం  రాత్రి దాకా నమోదైన కేసుల వివరాలు జిల్లాల వారీగా ఎలా ఉన్నాయంటే... నెల్లూరు జిల్లా-43 - కృష్ణా జిల్లా-29 - గుంటూరు జిల్లా-41 - కడప జిల్లా-28 - ప్రకాశం జిల్లా- 24 - పశ్చిమ గోదావరి జిల్లా- 21 - తూర్పు గోదావరి జిల్లా -11 - విశాఖపట్టణం జిల్లా-20 - చిత్తూరు జిల్లా-17 - అనంతపురం జిల్లా-6 - కర్నూలు జిల్లా-74 కేసులు ఉండగా... శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇక ఏపీ కంటే పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన తెలంగాణలో మంగళవారం కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాటికి తెలంగాణలో మొత్తం కేసులు 348కి చేరింది. అదే సమయంలో మంగళవారం కొత్తగా వైరస్ నుంచి కోలుకున్న వారు 45 కాగా .. ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11 గా తేలింది. మొత్తంగా ఆది నుంచి కరోనా కేసుల సంఖ్యలో ఏపీ కంటే తెలంగాణలోనే అధిక కేసులు నమోదవుతున్నాయని చెప్పాలి.
Tags:    

Similar News