న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా.. కారణం చెప్పకుండానే

Update: 2023-01-19 13:10 GMT
న్యూజిలాండ్.. ప్రపంచంలో శాంతికాముక దేశాల్లో ఒకటి. అక్కడి ప్రజలు స్నేహపూర్వకంగానూ ఉంటారు. ఇతరత్రా వివాదాలు పెద్దగా ఉండవు. విదేశీ వ్యవహారాల్లోనూ న్యూజిలాండ్ పాత్ర నిక్కచ్చిగా ఉంటుంది. ప్రపంచ శాంతికి ఏదైతే ఉపయోగకరమో.. దేనిద్వారా అయితే తమ ప్రయోజనాలకు ఇబ్బంది కలగదో ఆ విధానాన్నే పాటిస్తుంది. ఇక న్యూజిలాండ్ గురించి చెప్పాల్సిన మరో విశేషం ఆ దేశంలో మనుషుల కంటే గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉండడం.

జనాభా 50 లక్షలు.. గొర్రెలు 2.60 కోట్లు

విస్తీర్ణంలో న్యూజిలాండ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. కానీ, అక్కడ జనాభా 50 లక్షలే. పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉండే ఒక ద్వీపం న్యూజిలాండ్. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం, రెండోది దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటివాటి సమూహమే న్యూజిలాండ్. ఈ భూభాగాన్ని అన్నింటికన్నా చివరన కనుగొన్నారు. కాగా, జనాభా తక్కువగా ఉండడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా అంతే గట్టిగా ఉంటాయి. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో ఈ విషయం మరోసారి రుజువైంది. కొవిడ్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్నదని తెలిసిన మరుక్షణమే న్యూజిలాండ్ సరిహద్దులను మూసివేసింది. దాదాపు ఏడాదిపైగా బయటి నుంచి పురుగు కూడా రాకుండా చర్యలు చేపట్టింది. ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగితే అది తమ ఉనికే ముప్పు అని ఈ చర్యలు తీసుకుంది. కాగా, వైరస్ చెలరేగుతున్న కాలంలో న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ తీసుకున్న చర్యలకు ప్రశంసలు దక్కాయి. దీంతో రెండోసారీ కూడా

ఆమెనే ప్రధానిగా ఎన్నికయ్యారు.

అనూహ్యంగా రాజీనామా జెసిండా గురువారం అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే, దీనికి కారణాలు ఏమీ లేవని ఆమె చెప్పారు. కనీసం రహస్యం కూడా ఏమీలేదని అన్నారు. జెసిండాకు ప్రోగ్రెసివ్ పరిపాలకురాలిగా పేరుంది. కొవిడ్ తో పాటు 2019లో క్రైస్ చర్చ్, 2021 సెప్టెంబరులో జరిగిన ఉగ్ర దాడి సమయంలో జెసిండా చక్కటి స్పందనతో పేరు తెచ్చుకున్నారు. కానీ, ఇలాంటి ఆమె..తన రాజీనామాకు ఇదే తగిన సమయమని వెల్లడించారు. ‘నేనొక మనిషిని. మనం చేయగలినంత కాలం  చేస్తాం. తర్వాత సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైంది.

అయితే, అది అత్యంత సవాలుతో కూడుకున్న పని. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు కొనసాగలేం. మీరు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తా..? కాదా..? అనేది తెలుసుకోవడంకూడా ఒక బాధ్యతే. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావించడం వల్ల నేను ఈ పదవిని వీడటం లేదు. ఎందుకంటే మనం విజయం సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ లేబర్ పార్టీ సభ్యులతో మాట్లాడారు. తన రాజీనామా వెనక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించారు.

ద్రవ్యోల్బణం, మాంద్యం

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యంతో పాటు దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల జెసిండా నిర్ణయానికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఆమె ప్రభుత్వం ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు ఇటీవలి ఎన్నికల్లో పార్టీతో పాటు, జెసిండా వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయినట్లు వెల్లడైంది. దీంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, జెసిండా 2017లో తొలిసారి న్యూజిలాండ్ ప్రధానిగా నియమితులయ్యారు. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 2020లో జరిగిన ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. ప్రస్తుతం రాజీనామా ప్రకటించినప్పటికీ ఫిబ్రవరి 7 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది  అక్టోబర్‌ 14న జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగానూ కొనసాగుతారు. న్యూజిలాండ్ కొత్త ప్రధానిని ఈ నెల 22న ఎన్నుకోనున్నారు. కాగా, 2019లో క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని మసీదుపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె వ్యహరించిన తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఆ ఘటనలో 51 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డారు. ఆ హింసాకాండకు ఆమె ఎంతగానో చలించిపోయారు. అలాగే ప్రకృతి విపత్తు, కరోనా కల్లోలాన్ని ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News