సర్వే ఫీవర్...జాతకం తేలితే జంపింగే...!

Update: 2023-01-10 06:12 GMT
సర్వేల మీద సర్వేలు. నయా రాజకీయ ట్రెండ్ ఇది. గతంలో ఎన్నికల వేళకు ఏవో ఔత్సాహిక మీడియా సంస్థలు ప్రజల కోసం చివరాఖరున ఒక సర్వే చేసి వదిలేవి. అది నూరు శాతం జనాభిప్రాయాన్ని ప్రతిబింబించకున్నా కొంత వరకూ అప్పటి రాజకీయాన్ని ప్రభావితం చేసేది. అయితే ఇపుడు ప్రతీ పార్టీ సర్వేలు చేయిస్తోంది. ప్రతీ పది రోజులకు ఒక సర్వే. గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వే.

ఒకటి కాదు నాలుగైదు సంస్థలను పెట్టుకుని మరీ సర్వేల మీద సర్వేలు. ఇలా చేయించడం అన్నింటినీ క్రోడీకరించడం వల్ల ప్రజాభిప్రాయం పట్టుకోవడానికి చూస్తోంది. దానితో తమ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అభ్యర్ధులు కానీ ఎంతమేరకు గెలిచే అవకాశాలు ఉంటాయన్న దాని మీద కచ్చితమైన అభిప్రాయానికి రావడం జరుగుతోంది.

ఇదే ఇపుడు పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఆశావహులకు జ్వరం మాదిరిగా పట్టుకుంది. అధికార వైసీపీ సర్వేలు చేయిస్తోంది. అలాగే విపక్ష తెలుగుదేశం సర్వేలు చేయిస్తోంది. ఆ ఫలితాలను వారు చెప్పడంలేదు. కాస్తా మాకు కూడా లీకులు ఇస్తే మా దోవ మేము చూసుకుంటాం కదా అని నాయకులు అంటున్నారుట.

మీరూ మీరూ బాగానే ఉంటారు. మరి మా రాజకీయ మాటేంటి, మాకు చివరి నిముషంలో చెబితే గోడ దూకేదెట్టా అని కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ ని పెట్టి మరీ అడుగుతున్నారుట. జగన్ వరకూ చూసుకుంటే వర్క్ షాప్స్ పెడుతున్నారు. పనితీరు మార్చుకోవాలని కోరుతున్నారు. కానీ ఎవరి పేరునూ బయటకు చెప్పడంలేదు.

దాంతో ఎవరికి టికెట్ ఇస్తారు. రేపు ఎవరికి టిక్కు పెడతారు అన్నది కూడా తెలియడంలేదు అని అంటున్నారు. తమకు టికెట్ ఇవ్వరు అని తెలిస్తే తాము ఉన్న పార్టీలో ఎందుకు వేలాడుతామని నాయకులు అంటున్నారు. వేరే రూట్లలో తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటామని కూడా అంటున్నారు.

దాంతో ఏపీలో ఇపుడు రెండు ప్రధాన పార్టీలలోనూ సర్వే ఫీవర్ ఒక స్థాయిలో ఉంది. సర్వేలతో తమ కొంప కొల్లేరు చేస్తే ఊరుకోమని అంటున్న నాయకులూ ఉన్నారు. మేము కూడా రాజకీయంగా బతకాలి, మేము కూడా పాలిటిక్స్ లోనే ఉండాలి కాబట్టి మా జాతకం ఏంటో మాకు చెప్పేసి మా ముఖాన అసలు నిజాలు చెప్పేస్తే తరిస్తామని అంటున్నారు.

కానీ నాయకులు కోరుతున్నట్లుగా అధినాయకులు చెబుతారా. అసలు చెప్పరు. మీరే మాకు అని చివరి దాకా అనిపించుకుంటారు. అపుడు తమ సర్వే గుట్టుని విప్పి టికెట్ హులఖ్ఖి అంటారు. ఇది ఎపుడూ జరుగుతున్న విషయమే. అందువల్ల నాయకులు కూడా ఎవరి మటుకు వారు తమ పరిధిలో సర్వేలు చేయించుకుని తమ జాతకాలు తామే తేల్చుకుంటేనే బయటపడతారు లేకపోతే మునిగిపోతారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News