ఫ్రీగా వస్తే ఇంతే మరి : జగనన్న పధకాలకూ ఓట్ల గ్యారంటీ లేదు...?

Update: 2022-07-20 10:30 GMT
ఫ్రీ అన్న మాట చాలా అందమైనది. ఇంకా చెప్పాలీ అంటే టెంప్ట్ చేస్తుంది. ఏదైనా కష్టపడి సాధించే దానిలో ఉండే తృప్తి వేరబ్బా అనుకునేది వెనకటి తరం. కానీ ఇపుడు ఉచితం మా జన్మ హక్కు అని జనాలు అనుకునేలా చేశారు ఏలిన వారు. దాంతో వారు మాకు ఉచితం దక్కాల్సిందే అని గోల చేస్తున్నారు. అలాగే తమకు ఓట్లు రాల్చే అద్భుతమైన మార్గం ఇదే అని తలచి రాజకీయ పార్టీలు కూడాఆల్  ఫ్రీగా జనాలకు అన్నీ ఇవ్వడం మొదలెట్టాయి.

ఖజానాను ఖాళీ చేస్తూ అప్పులను పెంచేస్తున్నా బేఫికర్ గా ఫ్రీ స్కీమ్స్ ని ఏపీ సహా చాలా చోట్ల అమలు చేస్తున్నారు. ఈ విషయంలో దేశానికి ఏపీనే ఆదర్శం అని వైసీపీ నేతలు జబ్బలు చరచుకుంటున్నారు. మేము ఇచ్చినవ‌న్ని ఉచిత పధకాలు ఎవరూ ఇవ్వలేదు చూసుకోండి. లెక్క తీసుకోండి అని సవాల్ కూడా చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఫ్రీగా ఇస్తే ఎవరైనా ఎగబడతారు. తీసుకుంటారు, కానీ వారికి ఫ్రీ స్కీమ్స్ మీద ఉన్న శ్రద్ధ ఇచ్చిన పార్టీ మీద భక్తి గానీ అభిమానం కానీ ఉంటాయా అని ప్రశ్న వేస్తే కచ్చితంగా ఉండదు అని జవాబు వస్తుంది. ఎందుకంటే ఫ్రీగా మీరు ఇస్తే మేము తీసుకుంటున్నామంతే అని అంటారు. ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ ఏముంటుంది.

నీవు ఒకందుకు ఇస్తే నేను ఒకందుకు తీసుకున్నాని అని తెలివి మీరిన ఓటరన్న జవాబు చెబుతాడు. తాజాగా  ప్రమాదవశాత్తు ఒక పెట్రోలియం ఇంధనం తీసుకెళ్ళ లారీ ఏపీలో పల్నాడు వద్ద చెన్నై హైదరాబాద్ హై వే మీద బోల్తా పడింది. ఇంకేముంది అక్కడ సమీపంలో ఉన్న జనాలు లగెత్తుకుని వచ్చేశారు. వెంట క్యాన్లు. బకెట్లు, డ్రమ్ములు ఇలా చేతికి ఏది దొరికితే అది తెచ్చేసి మరీ పెట్రోల్ ని ఎంత దొరికితే అంత ఎగబడి మరీ తీసుకున్నారు.

ఇక్కడ అంతా ఒక్కటే పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, కుల మత వర్గాలు అంతకంటే లేవు. ఎదురుగా ఫ్రీగా వస్తోంది. ఎవరి శక్తి మేరకు వారు దాన్ని తీసుకెళ్ళడమే లక్ష్యం. మరి దీని కనుక ఏపీలో అమలవుతున్న ఉచిత పధకాలకు అన్వయించుకుంటే వైసీపీ వారు షాక్ తినాల్సిందే అంటున్నారు. ఫ్రీగా పధకాలు ఇస్తున్నారు కదా అని అన్ని పార్టీల వారు కూడా అందుకుంటున్నారు.

మరి వీరంతా వైసీపీకి కట్టుబడి ఉంటారా వీరవిధేయత చూపిస్తారా. పోనీ తమకు ఫ్రీగా పధకాలు ఇచ్చారు కదా అని జగన్ కి ఓటేస్తారా.  అంటే ఏమో చెప్పలేమనే జవాబు వస్తుంది. ఎందుకంటే వీరంతా ఉచితం మీద మాత్రమే భక్తితోత ఉన్నారు. ఒక విధంగా ఉచితం మా హక్కు అనుకుంటున్నారు. ఇచ్చేవారు వారికి ఎపుడూ మనసుకు పట్టరు. ఎన్నికల వేళకు మళ్ళీ తమకు నచ్చిన వారికి ఓట్లేసుకుంటారు. అపుడు వారికి పార్టీలు, కులాలు, మతాలు రాజకీయాలు అన్నీ గుర్తుకువస్తాయి.

దీన్ని బట్టి ఏమి అర్ధం చేసుకోవాలంటే ఉచితం ఎపుడూ రాజకీయ లాభాన్ని చేకూర్చదని, ఉచితం అన్నది ఇచ్చేవాడికి లోకువ అయితే పుచ్చుకునేవాడికి కూడా వాడుకగా మారుతుందని, ఈ ధర్మ సూక్ష్మాన్న్ని ఎరిగిన తరువాత ఎవరైనా కచ్చితంగా ఉచితాన్ని నమ్ముకుంటారా. ఎవరైనా ఉచిత పధకాల  మీద నమ్మకం ఉంచి ఊహాలోకంలో తేలిపోగలరా. కాబట్టి వైసీపీ వారు కూడా అలెర్ట్ కావాలి. ఉచితం అనుచితమని తెల్సుకుని కర్తవ్యం  ఏంటో గుర్తెరగాలి అని విలువైన సూచనలు వస్తున్నాయట మరి.


Full View
Tags:    

Similar News