ఇండియా సిమెంట్స్ ఎండీగా శ్రీనివాసన్ అవుట్... కొత్త డైరెక్టర్స్ వీరే!
ఇందులో భాగంగా... ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లకు చెందిన 32.72 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రక్రియను దిగ్గజ సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ పూర్తి చేసింది.
ఇండియా సిమెంట్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లకు చెందిన 32.72 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రక్రియను దిగ్గజ సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ పూర్తి చేసింది. దీంతో... ఇండియా సిమెంట్స్ ప్రమోటర్, ఎండీ, వైఎస్ ఛైర్మన్ గా ఉన్న ఎన్. శ్రీనివాసన్ తో పాటు ఇతర ప్రమోటర్లు వైదొలిగారు.
ఈ సమయంలో స్పందించిన ఇండియా సిమెంట్స్... శ్రీనివాసన్ భార్య చిత్రా శ్రీనివాసన్, కుమర్తె రూప గురునాథ్, మరో ప్రమోటర్ వీఎం మోహన్ తదితరులు కంపెనీ బోర్డు నుంచి వైదొలగినట్లు నియంత్రణ సంస్థలకు సమాచారం ఇచ్చింది. వీరంతా ఈ నెల 25న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత నుంచి బోర్డు నుంచి వైదొలగినట్లేనని కంపెనీ తెలిపింది.
వీరిలో స్వతంత్ర డైరెక్టర్లు ఎస్. బాలసుబ్రమణియన్ ఆదిత్యన్, లక్ష్మీ అపర్ణ శ్రీకుమర్, కృష్ణ శ్రీవాస్తవ, సంధ్యా రాజన్ లకు కూడా ఈ నెల 25 వ్యాపార వేళలు ముగియడమే బోర్డు సభ్యులుగా చివరి దశ అని అంటున్నారు! దీంతో... ఇండియా సిమెంట్స్ లో శ్రీనివాసన్ శకం ముగిసినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.
కాగా.. ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లకు చెందిన 10.13 (32.72 శాతం) కోట్ల ఈక్విటీ షేర్లను ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అయిన ఆల్ట్రాటెక్ తాజాగా కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆల్ట్రాటెక్ వద్ద ఇండియా సిమెంట్స్ కు సంబంధించిన 7.05 కోట్ల (22.77 శాతం) ఈక్విటీ షేర్లు కలిగి ఉంది.
ఈ నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ లో కొత్త డైరెక్టర్లుగా వివేక్ అగర్వాల్, కేసీ ఝాన్వర్, ఈఆర్ రాజ్ నారాయణన్, అశోక్ రామచంద్రన్ లను నియమించారు. ఇక.. స్వతంత్ర డైరెక్టర్లుగా అల్కా భరూచా, వికాస్ బాలియా, సుకన్య క్రిపాలు నియమితులయ్యారు.