నిలదీస్తున్న జనం...మాజీ మంత్రి అసహనం!

Update: 2022-09-24 14:51 GMT
జనం ముందుకు వస్తే వారు ఆదరణ అయినా చూపిస్తారు లేదా  నిలదీయడం అయినా చేస్తారు. వారి సమస్యలు తీరిస్తే హారతులు పడతారు. హామీలు నీటి మూటలైతే ఇదేంటని గద్దిస్తారు. ఇపుడు భీమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఆయన సొంత  నియోజకవర్గంలో ఇదే రకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. అవంతి గడప గడపకూ పేరిట చేస్తున్న కార్యక్రమంలో చాలా చోట్ల జనాల నుంచి నిలదీతలు సర్వసాధారణం అయిపోతున్నాయి.

మాకు చెప్పినదేంటి, ఏమి చేస్తున్నారు, ఇపుడు మళ్ళీ వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఎపుడు సమస్యలు పరిష్కారం అయ్యేది అంటూ తాజాగా భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలం రామవరం గ్రామంలో మంత్రి గారిని జనం నిలదీశారు. సవాలక్ష ప్రశ్నలతో ఆయనకు బీపీ పెంచేశారు. దాంతో ఒక దశలో అసహనానికి గురి అయిన మంత్రి గారు తాను కూడా ఎదురు మాటల దాడి చేశారు.

ఈ నేపధ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను వెనక్కి పంపి మాజీ మంత్రి గారి గడప గడపకు కార్యక్రమాన్ని అలా ముందుకు వెళ్ళేలా చేశారు. ఇదిలా ఉంటే భీమిలీలో అవంతికి ఈసారి ఎదురీత తప్పదని అన్ని రకాల సర్వేలు చెబుతున్నాయి. ఆయన ఇప్పటికి రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే ఆయన టీడీపీ కంచుకోట అయిన భీమిలీ నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి నెగ్గారు.

ఆ తరువాత జగన్ తొలి విడత మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కానీ మూడేళ్ల  మంత్రిగా ఆయన పెద్దగా చేసింది ఏమీ లేదు అని సొంత నియోజకవర్గం జనాలే పెదవి విరుస్తున్నారు. ఈ రకమైన వ్యతిరేకత ఉందనే ఆయన్ని మంత్రిగా తప్పించారు అని కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే గతంలో గడప గడప కార్యక్రమంలో జనాలు అవంతిని నిలదీస్తూ వచ్చారు.

దాంతో ఆయన రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. కానీ  వైసీపీ హై కమాండ్ మళ్లీ చేసి తీరాల్సిందే అని ఆదేశించడంతో అవంతి గడప తొక్కకతప్పలేదు అని అంటున్నారు. తీరా వాయిదా వేసి మళ్ళీ మొదలెట్టినా జనాల ఆగ్రహం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని తాజా ఉదంతంతో తెలుస్తోంది.

మాజీ మంత్రి జనం మీద కోపం పడితే వ్యతిరేకత మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు కదా అని అంటున్నారు. మొత్తానికి ఎన్నికలకు ఇరవై నెలల వ్యవధి ఉండగానే మాజీ మంత్రికి జనం ముంచి సెగలూ పొగలూ రావడంతో ఆయన 2024 ఎన్నికల్లో టెకెట్ దక్కించుకున్నా గెలుస్తారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News