బీజేపీలో తీవ్ర అసంతృప్తి...నితిన్ చుట్టూ అల్లుకుంటున్నారా...?

Update: 2022-09-05 14:30 GMT
ఈ రోజు దేశాన్ని ఏలుతున్న బీజేపీ తాను అత్యంత బలమైన పార్టీగా చెప్పుకుంటోంది. ఈ చెప్పుకోవడంలో ఆత్మ విశ్వాసం కంటే నియంత పోకడలే కనిపిస్తున్నారు. ఇద్దరు గుజరాతీలు కలసి కమలం పార్టీని నియంత్రిస్తున్నారు అన్న భావన అయితే పార్టీ లోపల కూడా ఇపుడు గట్టిగా వినిపిస్తోంది అంటున్నారు. బీజేపీలో చూస్తే గొంతు పెంచే స్వరాలు కనిపించడంలేదు. సీనియర్లను సాగనంపాం, అందరినీ అణచేశామని అనుకుంటున్న చోట ఇపుడు తీవ్ర అసంతృప్తి స్వరాలు అయితే వినిపిస్తున్నాయి అని అంటున్నారు.

నిజానికి బీజేపీ సిద్ధాంత బద్ధత కలిగిన పార్టీ. మిగిలిన పార్టీల మాదిరిగా అక్కడ వ్యక్తి పూజకు తావు లేదు. బీజేపీని మాతృ సంస్థ ఆరెస్సెస్ ఎపుడూ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నరేంద్ర మోడీకి అమిత్ షాకు ఆరెస్సెస్ పూర్తి స్వేచ్చ ఇచ్చింది. దాంతో వారు పార్టీని గెలిపించారు. అంతే కాదు, పార్టీలోని సీనియర్లుగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్కే  అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హా  వంటి వారిని పక్కన పెట్టారు.

ఆ తరువాత నెమ్మదిగా దేశంలోని ఇతర పార్టీలలోని అంతర్గత వ్యవహారాలను కూడా చూస్తూ అక్కడ దూరి చాలా చోట్ల అధికారం కోసం చీల్చే పనులను కూడా చేపట్టారు. ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో అధికారం వదిలేసుకున్న వాజ్ పేయ్ వంటి నాయకుడి సారధ్యంలోని పార్టీలో ఇపుడు చూస్తే అధికారం కోసం ప్రత్యర్ధి పార్టీలను చీల్చే కల్చర్ మొదలైంది. ఇక రాష్ట్రాల హక్కులను హరించే విధంగానూ బీజేపీ చేస్తోంది అన్న భావన కూడా వ్యాపించింది.

మొదట్లో బీజేపీలో ఉద్దండులు ఉండేవారు. దాంతో కొన్నాళ్ళ పాటు మోడీ వారితో కలసి ప్రజల కోరికల మేరకు పాలన చేసేవారు. కానీ గిర్రున మూడేళ్ళు తిరిగేసరికి సీని మొత్తం మారింది. పెద్ద నోట్ల రద్దు టైం లో కూడా మోడీకే జనాలు జేజేలు పలికారు. ఆయన ఏదో చేస్తారని, ఏది చేసినా మంచి కోసమే అని అంతా భావించారు. కానీ అది కాస్తా విఫల యత్నం అయింది అని తరువాత తెలిసి వచ్చింది. దాని వల్ల దేశం ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడింది కూడా.

ఇక దేశమంతా ఒకే పన్ను విధానం అంటూ జీఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల కేంద్ర ఖజానా నిండుతోంది కానీ ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. పోనీ అలా వచ్చిన మొత్తాన్ని తిరిగి రాష్ట్రలకు సవ్యంగా ఇచ్చి రాష్ట్ర  ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టే విధంగా చర్యలు ఉన్నాయా అంటే లేవు. అయినా సరే 2019 దాకా చూస్తే మోడీ వేవ్ బాగా సాగింది కాబట్టి జనాలూ పెద్దా పట్టించుకోలేదు.

ఇక 2019 నాటికి చూస్తే కాంగ్రెస్ దేశంలో దారుణంగా దెబ్బతినడంతో తమ హవాను అలా కంటిన్యూ చేస్తూ రెండవ సారి మోడీ అధికారంలోకి వచ్చారు. ఆ మీదట మరింత నిరంకుశంగా విధానాల అమలు సాగుతూ వచ్చింది. విపక్ష రాష్ట్రలా పట్ల వివక్ష. ఆర్ధిక ఆక్షలు, సొంత పార్టీలలో కూడా గొంతు నొక్కే విధానాలు ఇవన్నీ కలసి ఇపుడు బీజేపీలోనే భారీ ఎత్తున అసంతృప్తికి దారి తీస్తున్నాయని అంటున్నారు.

ఈసారి కనుక మోడీని ముందు పెడితే గెలిచే అవకాశం ఉంటుందా అన్న చర్చ అయితే పార్టీలో ఒక వైపు జోరుగా  సాగుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే  మహారాష్ట్ర దిగ్గజ నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన బీజేపీలో మోడీ షాలను ఎదిరించే సిసలైన నేతగా అవతరించారు అనే అంటున్నారు. ఇపుడు బీజేపీలో మోడీ సర్కార్ విధానాలు విమర్శించాలీ అంటే నితిన్ కంటే మ‌రొకరు లేరు అని కూడా అంటున్నారు. ఆ విధంగా నితిన్ ఉండడంతో ఆయన చుట్టూ బీజేపీలోని అసంతృప్తి నేతలు అల్లుకుని పోతున్నారు అని అంటున్నారు.

నితిన్ గడ్కరీ వంటి వారికి ఆరెస్సెస్ సాయం, అండ ఉండడంతో బీజేపీలో కూడా అనూహ్య పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ అయితే వస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం బీజేపీలో అతి పెద్ద కుదుపు తప్పదని కూడా అంటున్నారు. ఈ రోజుకీ ఆరెస్సెస్ గైడ్ లైన్స్ కి శిరసా వహించి బీజేపీలో పనిచేసే లక్షలాది మంది కార్యక‌ర్తలు ఉన్నారు. వారంతా కనుక రేపటి రోజున ఒక్క వైపునకు చేరితే మాత్రం బీజేపీలోనూ భారీ చీలిక తప్పదా అన్న చర్చ వస్తోంది. మరి ఈ రోజుకు అధికారం ఉంది. మోడీ షా బలంగా ఉన్నారు. కానీ ఎల్ల కాలం ఒక్కలా ఉండదు కాబట్టి బీజేపీలో కూడా ఏదైనా జరగవచ్చు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News