వీళ్ళు ఎన్నిపార్టీలు మారుతారు ?

Update: 2022-10-22 08:30 GMT
తెలంగాణాలో కొంతమంది నేతలు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. సిద్ధాంతాల కన్నా వ్యక్తిగత లబ్దే లక్ష్యంగా వీళ్ళు ఒక పార్టీలో నుండి మరొక పార్టీలోకి మారిపోతున్నారు. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీళ్లిద్దరు కూడా బీజేపీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. విచిత్రం ఏమింటే వాళ్ళిద్దరు బీజేపీలో చేరింది ఈ మధ్యనే. ముందు శ్రవణ్ విషయం చూస్తే రాజకీయ జీవితం మొదలు పెట్టింది ప్రజారాజ్యం పార్టీతో.

ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో  విలీనం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ మరణం తర్వాత తెలంగాణా ఉద్యమం మొదలైంది. దాంతో శ్రవణ్ తెలంగాణా ఉద్యమంలోకి దూకారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీయార్ తో గట్టు తగాదాలు మొదలైన తర్వాత ఇక ఆ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ లో చేరారు.

కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్న తర్వాత తనకు సరైన గౌరవం దొరకటం లేదని మొన్నటి ఆగష్టులోనే బీజేపీలో చేరారు. రెండు నెలల్లోనే మరి బీజేపీలో ఏమి లోపాలు కనిపించాయో కానీ రాజీనామా చేసి తాజాగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక స్వామిగౌడ్ విషయం చూస్తే ఈయన ఉద్యోగ సంఘాల నేత. 1969 నుంచి అన్ని దశల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణా ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేశారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నపుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

తెలంగాణా ఏర్పడిన తర్వాత గౌడ్ ను కేసీయార్ ఎంఎల్సీని చేసి తర్వాత శాసన మండలికి ఛైర్మన్ గా నియమించారు. పూర్తికాలం పదవిలో ఉన్న గౌడ్ తర్వాత పొడిగింపు కానీ లేదా వేరే కీలకపదవిని కోరుకున్నారు. అయితే కేసీయార్ మాత్రం గౌడ్ ఆలోచనలను పట్టించుకోలేదు.

దాంతో తాను ఆశించింది ఇక దక్కదని అర్ధమైపోయి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈయన కమలం పార్టీలో ఉన్నది మహా అయితే రెండు నెలలేనేమో. శ్రవణ్ తో పాటు గౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారో మళ్ళీ అదే పార్టీలో ఎందుకు  చేరారో వీళ్ళకే తెలియాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News